కోహీర్, మే 25: తమ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అవతరించిందని ఆనాడు ఆ గ్రామస్తులు సంతోషపడ్డారు. ఇక మీదట తమకు ఎలాంటి సమస్యలు ఉండవని ఆశించారు. కానీ, వారి ఆశలు నిరాశలవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనా భా ఉంది. జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం కోహీర్ను మున్సిపాలిటీగా ప్రకటించింది. దీంతో తమ సమస్యలు తీరుతాయని గంపెడాశలు పెట్టుకొన్న ప్రజలకు ఆడియాశలయ్యాయి.
కోహీర్‌లోని పలు వార్డుల్లో మురుగు కాల్వల నిర్మాణం ఇంత వరకు చేపట్టలేదు. తీంతో మురుగు నీరంతా సీసీ రోడ్లపై ప్రవహిస్తున్నది. గతంలో నిర్మించిన కొద్దిపాటి కాల్వలు కూడా చెత్తతో నిండిపోయాయి. ఆయా కాలనీల ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. రోడ్డు పక్కన కూడా చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజాప్రనిధులు అందుబాటులో లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రత్యేకాధికారుల పాలనలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
నిధులు లేక అధికారుల తిప్పలు…
కోహీర్ కొత్త మున్సిపాలిటీగా ఏర్పడడంతో మున్సిపల్ కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో మున్సిపల్ అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు ఏమిచేయలేక పోతున్నారు.
కొత్త మున్సిపాలిటీ కోహీర్కు నాలుగు నెలల్లో ముగ్గురు కమిషనర్లు వచ్చారు. ముందుగా ఉమామహేశ్వర్రావు, తర్వాత వెంకట్‌రెడ్డి విధులు నిర్వహించారు. నిధులు రాకపోవడంతో వారు చేసేదేమీలేక కోహీర్ నుంచి వెనుదిరిగారు. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్‌గా రమేశ్‌కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.నిధుల లేమితో పట్టణంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లపై మురుగు నీరు, రోడ్ల పక్కన చెత్త గురించి మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సమస్యల పరిష్కరానికి కృషిచేస్తామని ఆయన తెలిపారు.
సీసీ రోడ్లపై నడవలేని పరిస్థితి
కోహీర్‌లోని హనుమాన్ దేవాలయం నుంచి నాగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డుపై ఎప్పటికీ మురుగు పారుతున్నది. రోడ్డుపై నుంచి నడవలేని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి కొత్త మురుగు కాల్వలు నిర్మించాలి.
-గణేశ్‌రెడ్డి, కోహీర్ వాసి