తూప్రాన్, మే 1: ప్రైవేట్ కళాశాల నిర్లక్ష్యం కారణంగా రెండు గంటల పాటు డిగ్రీ పరీక్ష ఆలస్యమైన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తూప్రాన్ పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలకు కొన్ని సంవత్సరాలుగా ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయించారు.గత నెల 10న డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు నలంద డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈనెల 7న చివరి పరీక్ష ఉండగా బీఎస్సీ కంప్యూటర్స్ ఫస్ట్ సెమిస్టర్ గురువారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. ఉదయం పరీక్ష ప్రారంభమయ్యే సమయం అయిపోయేటప్పటికీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది కళాశాలకు రాలేదు.
కళాశాలకు తాళాలు వేసి ఉండటంతో పరీక్ష రాయటానికి వచ్చిన నలుగురు విద్యార్థులు అవాక్కయ్యారు. ఈవిషయాన్ని విద్యార్థులు తూప్రాన్ తహసీల్దార్ విజయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. కళాశాల యాజమాన్యం, సిబ్బంది స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ విజయలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆడిట్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించారు.
విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు పరీక్ష పత్రాలను ఎగ్జామ్ రూట్ ఆఫీసర్ సమక్షంలో యూనివర్సిటీ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసిన ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ తీసి విద్యార్థులకు అందజేశారు. దీంతో 11:45లకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ప్రారంభించారు. తూప్రాన్ ఆర్డీవో ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలంద డిగ్రీ కళాశాల యాజమాన్యం, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తూప్రాన్ పోలీసులకు తహసీల్దార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.