ఇల్లు కట్టి చూడు…పెండ్లి చేసి చూడు అన్న సామెత పెద్దలు ఊరికే అనలేదు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా సిమెంట్, స్టీలు,ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. వివిధ రకాల కంపెనీల గ్రేడ్లు, బ్రాండ్ల పేరిట సిమెంట్ ధరలు విపరీతంగా పెంచేశాయి. దీంతో సామాన్యుడి సొంతింటి కలపై కలగానే మిగులుతున్నది.
నిర్మాణదారులపై ఆర్థిక భారం పడుతున్నది. నెల రోజుల్లోనే ధరలు ఇంతగా పెరగడంతో ఇండ్లు నిర్మించుకునే వారు డైలామాలో పడ్డారు. బ్రాండ్ల పేరిటి ధరలు పెరిగిపోతున్నాయి. బిర్లా, భారతి, తదితర సిమెంట్ కంపెనీలు 25 శాతానికి పైగా ధరలు పెంచేశాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇంటి నిర్మాణాలు జరగక పోవడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరకడం లేదు. ఉపాధి లేక వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిద్దిపేట, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట పట్టణానికి చెం దిన మల్లయ్య అనే వ్యక్తి తనకున్న వంద గజాల స్థలంలో ఇంటి నిర్మాణా న్ని ప్రారంభించారు. ఇంటి నిర్మాణంలో భాగంగా రెండు స్లాబ్‌లు వేయడానికి ప్లాన్ వేసుకొని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో సిమెంట్ ధర బస్తాకు రూ.280 ఉండే, స్టీలు క్వింటాలు రూ. 5300 ధర ఉండే.. ఈ లెక్కన ప్రణాళిక సిద్ధ్దం చేసుకొని ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. తొలిస్లాబ్ పూర్తి చేసుకున్నాడు.
ఇటీవల రెండో స్లాబ్ వేయడానికి సిద్ధమయ్యారు. మార్కెట్లో ఒక్కసారి ధరలు పెరిగాయి. సిమెంట్, స్టీల్ ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం బస్తా సిమెంట్ ధర రూ. 340 పైగానే ఉంది. స్టీలు ధర రూ.5800 పైనే ఉంది. దీంతో రెండో స్లాబ్‌కు వచ్చే వరకు తన అంచనా తప్పింది. తొలి స్లాబ్ కన్నా రెండో స్లాబ్ వేయాలంటే భారీగా ఖర్చు అవుతున్నది. దీంతో రెండో స్లాబ్ వేయడానికి డైలామాలో పడ్డాడు. ప్రస్తుతం ఖర్చు భారీగా పెరగడంతో తన ఇంటి నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడురు.
ఇది ఒక మల్లయ్య ఇంటి నిర్మాణానికి సంబంధించిన లెక్క కాదు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న వారందరి పరిస్థితి ఇలానే ఉంది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేసింది. వారు ఇంటి నిర్మాణాలు చేయాలంటే జంకుతున్నారు. పెరిగిన ధరలతో మాకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎక్కడ సరిపోతాయి, ఈ పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం చేయడం కష్టంగా మారుతుందని వారు చెబుతున్నారు. రోజురోజుకు ధరలు బాగా పెరుగుతుండడంతో నిర్మాణరంగం కుదేలవుతున్నది.
సామాన్యుల నడ్డి విరిచిన కంపెనీలు…
వివిధ రకాలకు చెందిన సిమెంట్ కంపెనీలు ఇష్టానుసారంగా రేట్లు పెంచి సామాన్యుడి నడ్డివిరిచాయి. నెల కిందట వివిధ రకాల బ్రాండ్లకు చెందిన బస్తా సిమెంట్ ధర రూ. 260 నుంచి రూ.300 వరకు ఉండేది. ప్రస్తుతం బస్తా సిమెంట్ ధర రూ. 60 నుంచి రూ.80 వరకు పెరిగింది. స్టీలు క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.600కు పైగా పెరిగింది. ఇసుక టన్నుకు గతం లో రూ. 1000 నుంచి రూ.1100 మధ్యన ఉండేది. ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.1400 నుంచి 1600 వరకు పెరిగింది.
ఇసుక విషయానికి వస్తే గతంలో టన్నుకు రూ.1400 ఉండే, ప్రస్తుతం టన్నుకు రూ.1800 పైగా ధర ఉంది. ఇలా అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యడు ఇల్లు కట్టే పరిస్థితులో లేడు. ఒకవైపు అంతంత మాత్రంగానే నిర్మాణాలు జరుగుతుంటే, తాజాగా కంపెనీలు ధరలను పెం చడంతో నిర్మాణరంగం కుదేలవుతున్నది. మరో వైపు సిమెంట్ పరిశ్రమలు తగ్గుతున్నాయి. బస్తాపై 28శాతం జీఎస్టీ, రవాణా ఖర్చులు భారంగా మారి కంపెనీలు ధరలు పెంచాయని దుకాణాదారులు చెబుతున్నారు.