సంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 50శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ పోరుకు పోనున్నది. జిల్లా స్థాయిలో ఈనెల 22, 23 తేదీల్లో రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని గురువారం జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడి, సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం పంచాయతీ ఏర్పాట్లు చేపడుతున్నది.
గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే శనివారం స్వీకరించనున్నారు. గతంలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే సవరించి తుది ఓటరు జాబితాను ప్రచురించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 23న తుది ఓటరు జాబితాను పంచాయతీల్లో ప్రదర్శించే అవకాశం ఉంది. పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 50 శాతం రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని అధికారులు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీంతో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 పంచాయతీలు, 5370 వార్డులు ఉన్నాయి. గ్రామ సర్పంచ్, 5370 వార్డు మెంబర్ల కోసం డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తున్నది. పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేశారు. మొదటి విడతలో 136 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి మండలంలోని 11, కందిలో 22, కొండాపూర్‌లో 24, పటాన్చెరులో 3, గుమ్మడిదలలో ఎనిమిది, హత్నూరలోని 38 పంచాయతీల్లో 1246 పోలింగ్ కేంద్రాల్లో మొదటి ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో 243 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
అందోల్ మండంలోని 25, చౌటకూరులోని 15, పుల్కల్లో 19, వట్పల్లిలో 22, రాయికోడ్‌లో 32, ఝరాసంగంలో 33, జహీరాబాద్‌లో 22, మొగుడంపల్లిలో 22, కోహీర్‌లో 23, మునిపల్లిలోని 30 పంచాయతీల్లోని 2164 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో విడతలో కల్హేర్ మండలంలోని 15 పంచాయతీలు, కంగ్గిలోని 33, మనూరులో 22, నాగల్గిద్దలో 33, నారాయణఖేడ్‌లో 47, నిజాంపేటలో 18, సిర్గాపూర్‌లో 28, న్యాల్కల్లో 38 పంచాయతీల్లోని 1960 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు.