సంగారెడ్డి, జూన్ 12(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వల్లూరు క్రాంతి జనవరి 4, 2024న సంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 15 నెలల పాటు కలెక్టర్‌గా పనిచేశారు. మహిళా సాధికారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. జహీరాబాద్ ఎంపీపార్లమెంట్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూశారు.
ఆమె బదిలీ అవుతారని కొద్ది నెలలుగా జిల్లాలో ప్రచారం సాగుతూ వచ్చింది. గురువారం ఆమె బదిలీ ఉత్తర్వులు వెలువడటం అధికార, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అసంతృప్తి కారణంగానే కలెక్టర్ క్రాంతిని అప్రాధాన్యమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. హన్మకొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.ప్రావీణ్యను సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన పి.ప్రావీణ్య 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పి.ప్రావీణ్య జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
సిద్దిపేట, జూన్ 12: సిద్దిపేట కలెక్టర్‌గా కె.హైమావతిని నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.మనుచౌదరి మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హైమావతిని సిద్దిపేట కలెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.