సంగారెడ్డి, మార్చి 28(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో పవర్ హాలిడేలు లేవు. గతంలో వారంలో రెండు నుంచి మూడురోజులు పవర్ హాలిడేలు ఇచ్చేవారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం అప్పట్లో పరిశ్రమల యాజమాన్యాలు ధర్నాలకు దిగాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు కరెంటు కష్టాలను తెరదించారు. కంపెనీలకు 24గంటల పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. ప్రస్తుతం తిరిగి కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు అప్రకటిత విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయి.
వేసవికాలం ప్రారంభం కాగానే వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా కావడం లేదు. గృహాలకు విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. తాజాగా పరిశ్రమలకు అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 1697 భారీ, వాణిజ్య పరిశ్రమలు, 2వేలకు పైగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కువగా భారీ, వాణిజ్య పరిశ్రమలు ఉన్నాయి.
భారీ, వాణిజ్య పరిశ్రమలకు ఎక్కువగా నిరంతరం విద్యుత్ అవసరం ఉండగా, విద్యుత్‌శాఖ భారీ పరిశ్రమలకు అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. జిల్లాలోని 1697 భారీ పరిశ్రమలు ఉండగా, వీటిలో 1531 పరిశ్రమలకు 11కేవీ, 162 పరిశ్రమలకు 33కేవీ, నాలుగు కంపెనీలకు 132కేవీ కరెంటును విద్యుత్‌శాఖ సరఫరా చేస్తున్నది. 1697 భారీ, వాణిజ్య పరిశ్రమలకు ప్రతినెలా సుమారు 988.16 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ట్రాన్స్‌కో గతనెల నుంచి 838.62 మిలియన్ యూనిట్లు మాత్రమే పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పరిశ్రమల డిమాండ్‌కు సరిపడా విద్యుత్ లేకపోవటంతో ట్రాన్స్‌కో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నది.
పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని భారీ పరిశ్రమలకు 5 నుంచి 7 గంటల పాటు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రతి ఆదివారం లైన్ నిర్వహణ పేరుతో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. దీనికి అదనంగా పది రోజులుగా ప్రతిరోజు అప్రకటితంగా 7 గంటలు విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో కంపెనీల్లో యంత్రాలు, మోటర్లు పాడవడంతో పాటు ఉత్పత్తుల నాణ్యతపైనా ప్రభావం పడుతుందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ కొరత కారణంగా బాయిలర్లు చల్లారి, తిరిగి వేడెక్కేందుకు గంటల తరబడి సమయం పడుతున్నదని కార్మికులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 24గంటల విద్యుత్ సరఫరా చేయటంలో విఫలం కావడంతో పలు కంపెనీలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. జిల్లాలో భారీ పరిశ్రమలు విద్యుత్ పంపిణీ సంస్థలతో సంబంధం లేకుండా నేరుగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం కంపెనీలు ఇప్పటికే ఉన్న ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను వాడుకుంటున్నాయి.
ఇందుకోసం డిస్కంలకు వీలింగ్, సర్‌చార్జీలను చెల్లిస్తున్నారు. టైమ్ ఆఫ్‌డే(డీవోటీ) విధానంలో ఎక్కడ చౌకగా విద్యుత్ దొరికితే అక్కడి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే 81 పరిశ్రమలు ఓపెన్యాక్సెస్ ద్వారా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనుమతులు సాధించాయి. గతనెల నుంచి ఎనిమిది భారీ పరిశ్రమలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయడం ప్రారంభించాయి. పరిశ్రమలకు అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేయడం లేదని ట్రాన్స్‌కో ఎస్ఈ సుధీర్ తెలిపారు. ఎక్కడైనా లైన్, సబ్స్టేషన్ల మెయింటెనెన్స్ ఉంటే మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
పటాన్చెరు రూరల్, మార్చి 28 : పారిశ్రామిక వాడల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. మేము తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారం రోజులుగా పవర్ ఎప్పుడు వస్తుందో, పోతుందో అర్థం కావడం లేదు. పాశమైలారంలో ఇప్పుడు 450 పరిశ్రమలు నడుస్తున్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. వేళాపాళా లేకుండా కరెంట్ తీస్తున్నారు. శుక్రవారం 8 నుంచి 10గంటల వరకు పవర్ కట్ అయ్యింది.
జనరేటర్లు వాడుదామంటే డీజిల్ దొరకట్లేదు. పరిశ్రమలకు ఈ వేసవిలో గడ్డుకాలం తప్పదని అర్థంమవుతున్నది. ఏ అధికారికి పట్టింపులేకుండా పోయింది. పవర్లేక మేము కార్మికులను ఖాళీగా కూర్చోబెడుతున్నాం. వర్కర్లకు ఓటీలుంటేనే లాభం. ఓటీల ముచ్చటపోయి అసలు ఉపాధి ఏ షిప్టులో కల్పించాలో తెలియడం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మూడు షిప్టులకు కరెంటు ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికే అర్డర్లు తీసుకున్న పారిశ్రమికవేత్తలు సమస్యలు చవిచూడాల్సి వస్తున్నది. ఆర్డర్లు కంప్లీట్ చేయకుంటే నష్టపోతాం. మమ్మల్ని ప్రభుత్వం రక్షించాలి.
– చందుకుమార్ పొట్టి, పారిశ్రామికవేత్త, మాజీ ఐలా చైర్మన్. పాశమైలారం (సంగారెడ్డి జిల్లా)
రామచంద్రాపురం, మార్చి 28: ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తే పరిశ్రమలు కుదేలవుతాయి. పరిశ్రమలతో పాటు కార్మికులకు తీరని నష్టం జరుగుతుంది. కార్మికులకు పని కరువై జీవితాలు ఆగమవుతాయి. రోజువారి డ్యూటీలతో పాటు ఓటీలు దొరికితేనే కార్మికుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. పవర్ హాలిడే ప్రకటిస్తే పరిశ్రమల్లో ప్రొడక్షన్ తగ్గి కార్మికులకు సరైన వేతనాలు చెల్లించకపోవడంతో పాటు పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లి పరిశ్రమల మనుగడ, కార్మికుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతాయి. పరిశ్రమలకు నాణ్యమైన కరెంట్‌ను ప్రభుత్వం సరఫరా చేయాలి.
– జి.సురేందర్, భెల్ కార్మికుడు, రాష్ట్ర లోక్ జనశక్తి లేబర్ సెల్ అధ్యక్షుడు
జిన్నారం, మార్చి 28: పరిశ్రమలకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రస్తుతం గ్యాస్ కొరతతో పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమయంలో విద్యుత్ కోతలతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు మూతపడకుండా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. విద్యుత్ సమస్యపై కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతాం.
– రాజయ్య, కార్మిక సంఘం నాయకుడు, జిన్నారం (సంగారెడ్డి జిల్లా)