హుస్నాబాద్, డిసెంబర్ 17: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం భవనం ఐదో అంతస్తులో తనకు కేటాయించిన ప్రత్యేక చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, ఆశీర్వాదాలతో పదవీబాధ్యతలు తీసుకుని, రెండు శాఖలకు సంబంధించిన రెండు ఫైళ్లపై సంతకం చేశారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, సచివాలయం అధికారులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తరలివెళ్లి, మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్కు తరలివెళ్లిన వారిలో సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, ఎండీ హసన్, మడప యాదవరెడ్డి, అక్కు శ్రీనివాస్, బంక చందు, పున్న సది, వల్లపు రాజు, చిత్తారి పద్మ, అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, అభిమానులు ఉన్నారు.