హుస్నాబాద్, జూన్ 12: బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఓట్ల తొలిగింపు ప్రక్రియను మొదలు పెట్టిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ కుట్రలకు బీహార్, బెంగాల్ రాష్ర్టాలు బలైన పరిస్థితులే ఇందుకు నిదర్శనమన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శుభం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 88లక్షల ఓట్లు తేడా ఉన్నట్లు తేర్చారని, ఇప్పుడు ఆ ఓట్లు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను తొలగించి వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. 2002లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ల సర్వే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందన్నారు. బీజేపీ మాత్రం సర్‌ను తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 307 బూత్‌ల పరిధిలోని 2,54,293ఓట్లలో 61వేల ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నట్లు చెప్పారు. సర్ పేరుతో అర్హులైన ఓట్లను తొలిగిస్తే అడ్డుకునేందుకే కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పీసీసీ ప్రతినిధి పవన్మల్లాది, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.