హుస్నాబాద్, సెప్టెంబర్ 11: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబాద్, కోహెడ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో బ్రిడ్జిలు, కల్వర్టులు, బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే వీటి పనులు పూర్తవుతాయన్నారు.
నియోజకవర్గాన్ని ప్లాస్టిక్హ్రితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. తన తండ్రి స్మారకార్థం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని కేంద్ర మంత్రులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, త్వరలోనే యూరియా కొరతను తీర్చుతామన్నారు. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
కోహెడ మండలంలో గొట్లమిట్ట-నారాయణపూర్ మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, కోహెడ-మైసంపల్లి, సీసీపల్లి-కాచాపూర్ బ్రిడ్జిలకు, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి-పరివేద బీటీ రోడ్డు నిర్మాణానికి, హుస్నాబాద్ పట్టణంలో పల్లెచెరువు మరమ్మతులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ శాఖ ఏర్పాటు చేసిన ఆల్బీయన్ బస్సు నమూనాను, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య పాల్గొన్నారు.