పటాన్చెరు, జూన్ 21: ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో షోడో పోలీసులు అడుగడుగునా వీడియోలు తీశారు. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం రైతులకు రైతు భరోసా డబ్బులు నిలిపి వేసింది. దీంతో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిన్నారంలో మహాధర్నా నిర్వహించారు.
ఈ మహాధర్నాకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుతో పాటు సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉండి మహాధర్నాకు వచ్చిన వారి వీడియోలు తీసుకున్నారు. వేదికపై ముఖ్యనేతలు మాట్లాడుతుండగా సివిల్‌డ్రెస్‌లో ఉన్న పోలీసులు వీడియో రికార్డు చేశారు.
మహాధర్నా వద్ద సివిల్ డ్రెస్‌లో పోలీసులు ఉండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఏ గ్రామాల నుంచి రైతులు వచ్చారో వివరాలు సేకరించారు. మహా ధర్నాకు ర్యాలీగా వస్తున్న వారి వీడియోలు రికార్డు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు రావడం లేదని, రైతులు రాకుండా ఉండేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేయడం కనిపించింది. మహాధర్నాకు ముందుగా బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి వచ్చారు.