నర్సాపూర్, ఫిబ్రవరి 13 : ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు జేఏసీతో కలిసి పోరాటాల్లో పాల్గొనాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. గురువారం నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పంతాలకు పోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. భూసర్వే చేసేవరకు డంపింగ్ యార్డు పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలిపారు. డంపింగ్ యార్డు ఏర్పాటైతే గుమ్మడిదల మండలం, నర్సాపూర్ నియోజకవర్గానికి శాపంలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీలకతీతంగా జేఏసీ ఏర్పా టు చేసుకుందామని గతంలో కోరగా, కాంగ్రెస్ నాయకులు ముందుకు రాలేదన్నారు. డంపింగ్ యార్డుకు బీఆర్ఎస్ అనుమతులు ఇచ్చిందని రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. డంపింగ్‌యార్డు ఏర్పాటైతే కలుషిత నీరు రాయారావు చెరువులోకి చేరి అక్కడి నుంచి గొలుసుకట్టు ద్వారా మిగతా చెరువుల్లోకి కలుషిత నీరు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రుస్తుంపేట్, రాంచంద్రాపూర్, కాసాలా, రెడ్డిఖానాపూర్ అక్కడి నుంచి ఘనపూర్ ఆనకట్ట వరకు నీరు కలుషితం అయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ఆయకట్టు ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉందన్నారు. వీటిపై కాంగ్రెస్ నాయకులు స్పందించకుండా బట్టకాల్చి బీఆర్ఎస్ వేయడం తగదని మండిపడ్డారు.
డంపింగ్‌యార్డు ప్లాన్‌కు సంబంధించి 2009లోనే ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారని, కానీ.. కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ మాట్లాడిన వీడియోలు చూపెడుతూ మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. కేటీఆర్ మాట్లాడింది నిజమేనని, 2008-09లో జవహర్‌నగర్ ప్రాంతమంతా కలుషితమైతే ప్రజలంతా కోర్టుకెళ్తే జీహెచ్ఎంసీ చెత్తంతా అక్కడకు తీసుకువస్తే ప్రజల ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుందని, జీహెచ్ఎంసీ చుట్టుపక్కలకు చెత్తను తరలించాలని కోర్టు ఆదేశించినట్లు గుర్తుచేశారు. ఆ విధంగా 2008-09లోనే ప్యారానగర్, లక్డారం, చౌటుప్పల్ డంపింగ్‌యార్డుల కోసం ఎంపిక చేసి కోర్టుకు నివేదించినట్లు తెలిపారు. 2014లో డంపింగ్ యార్డ్డు నిర్మాణం జరగాల్సి ఉన్నా, తెలంగాణ ఉద్యమం మూలంగా ఆగిపోవడం జరిగిందని, 2015లో నిర్మాణం ప్రారంభిస్తే అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ రావడానికి సమయం పట్టిందని ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంగా తెలిపాడని గుర్తుచేశారు.
గుమ్మడిదల మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు, ప్రజలు ప్యారానగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దని తీర్మానాలు చేశారని, ఈ తీర్మానాలను తీసుకొని హరీశ్‌రావు, కేటీఆర్ వద్దకు గతంలో వెళ్లినట్లు గుర్తుచేశారు. అటవీ ప్రాంతమని తమకు తెలియదని, రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమిని కేటాయించిందని కేటీఆర్, హరీశ్‌రావు ఈ నిర్మాణాన్ని నిలిపివేశారని స్పష్టంగా తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో డంపింగ్ యార్డు నిర్మాణం జరగలేదని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 13 నెలల తర్వాత ఈ పనులు ప్రారంభించిందని గుర్తుచేశారు. డంపింగ్‌యార్డు పనులు ఎవరు ప్రారంభించారో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని సునీతాలక్ష్మారెడ్డి హితవు పలికారు.
కాంగ్రెస్ నాయకులు చూపిం చే పత్రాలు కేవలం అటవీ భూమిని కేటాయించిన వివరాలు మాత్రమే ఉన్నాయని, దానిని పట్టుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జీహెచ్ఎంసీకి భూమిని అప్పగిస్తే డంపింగ్ యార్డు పెడతారని అప్పట్లో తెలియదని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే డంపింగ్ యార్డు పెట్టుకోవాలని కోర్టు చెబితే, దానిని తుంగలో తొక్కి నేడు జీహెచ్ఎంపీ పరిధి కాకుం డా ప్యారానగర్లో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. 2008లోనే డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘుప్రసాద్ తెలిపిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడేమో దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు అతీతంగా గుమ్మడిదల, నర్సాపూర్ ప్రాంతాలను ఈ విష కాలుష్యం నుంచి కాపాడడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని కాంగ్రెస్ నాయకులను సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. కొల్చారం, చిలిపిచెడ్ మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి వచ్చి ఇస్తారని నిలిపివేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మిగలొద్దని, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ప్రపోజల్ పంపిస్తేనే అనుమతులు వస్తాయని, దీనికెందుకు గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు షేక్‌హుస్సేన్, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.