హుస్నాబాద్, అక్టోబర్ 8: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి సనాదుల వివేక్ మృతి మిస్టరీగా మారింది. ఇది హత్యనా, ఆత్మహత్యనా, ప్రమాదమా అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంఘటన వద్ద ఉన్న ఆనవాళ్లను బట్టి చూస్తే ఇది ప్రమాదకరంగా జరిగినట్లు కనిపించడం లేదు. స్టీల్ రేలింగ్‌కు కట్టిన బట్టతాడుకు ఉరిపడినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కేవలం నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న రేలింగ్‌కు కట్టిన తాడుకు ఉరిపడితే అంతకంటే ఎత్తు ఉన్న వివేక్‌కు ఎలా ఉరిపడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు ఉరిపడితే లేచి నిలబడి మెడకు పడిన తాడును తీసేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, అదే తాడుకు ఉరిపడిందని చెప్పడం నమ్మదగిన విషయంగా లేదు.
దీంతో పాటు వివేక్‌కు ఉరిపడగా మెడచుట్టూ నల్లగా మారిన ప్రాంతం సన్నటి దారంతో ఉరిపడినట్లు కనిపిస్తోంది. ఉపాధ్యాయులు చెబుతున్న రేలింగ్‌కు ఉన్న దారం మందంగా ఉంది. రేలింగ్ తాడుకే ఉరిపడితే మెడచుట్టూ నల్ల మరక సన్నగా కాకుండా దొడ్డుగా ఉండాల్సింది. కానీ, అలా లేదు. మృతుడు వివేక్ మెడకు అప్పటికే నల్ల దారం ఉంది. అదే దారంతో మెడ చుట్టూ ఎవరో గట్టిగా లాగితేనే చనిపోయాడని, ఆ దారం గుర్తులు మెడపై కనిపిస్తున్నాయి తప్ప రేలింగ్‌కు ఉన్న తాడు గుర్తులు లేవని కుటుంబస భ్యులు ఆరోపిస్తున్నారు. మెడలో ఉన్న దారంతోనే చంపి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరగతి గది ముందు రేలింగ్‌కు బెడ్‌షీట్‌కు సంబంధించిన దారం ఎందుకు కట్టారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదే తాడుకు ఉరిపడితే కనీసం సాగి ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. సంఘటన జరిగిన ముందు రోజైన సోమవారం రేలింగ్‌కు తాడు లేదని పలువురు విద్యార్థులు సైతం చెప్పడం గమనార్హం. ఉపాధ్యాయులు, విద్యార్థుల వేధింపులతో వివేక్ గదిలో ఉరివేసుకోగా, దీనినే ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. గతంలో ఇదే గురుకులంలో విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని గాయాల పాలైన సంఘటనలు జరిగాయి. గతంలో జరిగిన సంఘటనలను బట్టి చూస్తే వివేక్‌ది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదనేది మరికొందరి వాదన. అంతేకాకుండా ఉరిపడిన వెంటనే సీపీఆర్ చేసి దవాఖానకు తరలించే వర కు ప్రాణంతో ఉన్నాడని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
కానీ, దవాఖానకు తీసుకొచ్చాక పరీక్షలు చేయగా, అప్పటికే మృతిచెంది ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చెప్పే విషయాలకు ఒకటికొకటి పొంతన లేకుండా ఉండటంతో ఇంకా ఏదో మిస్టరీ ఉందనే అనుమానం కలుగుతోంది. గురుకుల ప్రిన్సిపాల్ సహా ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని వివేక్ తల్లిదండ్రులు లావణ్య, సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టుతో పాటు ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపితే తప్ప వివేక్ మృతి మిస్టరీ వీడే అవకాశం లేదని చెప్పొచ్చు.