సిద్దిపేట, అక్టోబర్ 8: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణే ప్రథమ బాధ్యతగా పనిచేస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు. అసాంఘిక కార్యక్రమాలను ఉకుపాదం తో అణిచివేస్తామన్నారు. డ్రగ్స్హ్రిత జిల్లాగా సిద్దిపేటను మార్చేందుకు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులు సహకరించాలని కోరారు.
మహిళలకు మహిళా పోలీస్ స్టేషన్, స్నేహిత సపోర్ట్ సెంటర్, భరోసా సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి తదుపరి కేసులు నమోదు చేసి అండగా ఉంటామని తెలిపారు. పోక్సో కేసుల్లో భరోసా సెంటర్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత కేసులు నమోదు చేస్తామన్నా రు. పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, పబ్లిక్ న్యూసెన్స్ తదితర అంశాల కట్టడికి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా కృషి చేస్తామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలుతో పాటు సజావుగా పోలింగ్ జరిగేందుకు అందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ కోరారు. సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు కల్పిస్తామని ఆయన తెలిపారు. బెల్ట్ షాప్‌లపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 5 చెక్ పోస్టులు, 26 ఫ్లయింగ్ సాడ్స్ నియమించినట్లు చెప్పారు. డబ్బులు, మద్యం సరఫరా చేసి ఓటర్లను ప్రభావితం చేసే వారిని వదిలిపెట్టమన్నారు. ఎన్నికల సంఘం చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, ఎన్నికల నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించడం, డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కాల్ చేసి సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు గంటలోపు కాల్చేసి సమాచారం అందించాలని సూచించారు. ఆన్లైన్ యాప్‌లో లోన్లు తీసుకోవద్దన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎంతోమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయని, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగ్ ఆడుతున్నారని అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాలర్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, నరసింహులు, సదానందం, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ పాల్గొన్నారు.