చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 19: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలోని హెచ్‌పీ బంకులో శుక్రవారం ఒక ట్రాక్టర్లో డీజిల్ పోయించుకోగా అందులో నీరు వచ్చింది. శుక్రవారం హెచ్‌పీ పెట్రోల్ బంకులో బండారి యాదగిరి అనే వినియోగదారుడు ట్రాక్టర్లో వెయ్యి రూపాయల డీజిల్ పోయించుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లి ట్రాక్టర్ నుంచి డీజిల్ తీయగా, ఆ డీజిల్‌లో నీరు కలిసి ఉంది. తిరిగి పంపు వద్దకు వచ్చి యాదగిరి దీనిపై ఆందోళనకు దిగాడు.
దీంతో నిర్వాహకులు తిరిగి ట్రాక్టర్లో డీజిల్ పోశారు. ట్రాక్టర్‌కు ఏమైనా అయితే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇవ్వడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ ఘటనపై వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ బంకులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కల్తీ పెట్రోల్, డీజిల్‌తో వాహనాలు చెడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీ చేసి కల్తీ పెట్రోల్, డీజిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.