సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6: పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై జంతు ప్రేమికులతో మాట్లాడారు. సంగారెడ్డి పట్టణంలో దాదాపు వెయ్యి కుటుంబాలు పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాయని, వీరందరూ తప్పక వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. జిల్లాలో కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) చేయిస్తున్నామని పేర్కొన్నారు. వాటి సంఖ్యను నియంత్రించేందుకు 100 శాతం ఫర్టిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
వీధి కుక్కలు ఆహారం కోసం రోడ్లపై తిరగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఆరుబయట చెత్త వేయవద్దని, చెత్త సేకరించే మున్సిపల్ వాహనాల్లో వేయాలని కోరారు. బస్తీ, పట్టణ సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో వీధి కుక్కలకు తాగునీరు, ఆహారం అందించి, వాటిని దత్తత తీసుకునేలా కృషిచేయాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పశువైద్యశాలలోని ఏడీడీఎల్ ల్యాబ్‌ను కలెక్టర్ పరిశీలించి కార్యక్రమాల గురించి ఆరాతీశారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్, సిబ్బండి పాల్గొన్నారు.