గజ్వేల్, మార్చి 1: భూసేకరణతో సర్వం కోల్పోయిన మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని విధాలుగా వసతులు కల్పిస్తామని చెప్పిన అధికారులు, నిర్వాసితులకు శ్మశాన వాటికలకు స్థలం కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని కాలనీల్లో జిల్లా అధికారులు పర్యటించినప్పుడు పలుసార్లు మొర పెట్టుకున్నా తమ గోడు వినడం లేదని, తమవారు ఎవరైనా మృతిచెందితే కాలనీ సమీపంలోని కుంట పక్కనే దహన సంస్కారాలు చేస్తున్నామని, శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ సమీపంలో ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల మధ్య 600 ఎకరాల విస్తీర్ణంలో మల్లన్నసాగర్ ప్రాజెకు నిర్వాసితులకు పునరావాస కాలనీని నిర్మించారు. ఒకేచోట కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం, తొగుట మండలం పల్లెపహాడ్, తండా, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, బంజేరుపల్లి, లక్ష్మాపూర్ తదితర గ్రామాల నిర్వాసితుల కోసం కాలనీ నిర్మాణం చేపట్టారు. ఈ గ్రామాల్లో ఎవరైనా మృతిచెందితే వారి దహన సంస్కారాలు చేయడం వారికి తలకుమించిన భారంగా మారింది. ఎక్కడ చివరి మజిలీ కార్యక్రమాలు పూర్తిచేయాలో తెలియక కాలనీ సమీపంలోని చెరువు కుంట పక్కనే దహన సంస్కారాలు, సమాధులు పెడుతున్నారు.
కొద్దిరోజుల క్రితం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందగా, కార్యక్రమాల కోసం కుంట పక్కనే జేసీబీ సాయంతో సమాధి తీస్తుండగా, అందులో నుంచి ఎముకలు రాగా, మరో దాంట్లో కుళ్లిపోయిన మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. ఒకేచోట అన్ని గ్రామాల వారు సమాధులు పెడుతుండడంతో సమస్యగా మారుతున్నది. సమాధిపైనే మరొకరి సమాధి నిర్మాణాలు చేపడుతున్నారంటే సమస్య ఎంతగా ఉందో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కాలనీలో పర్యటించిన కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలకు పలుసార్లు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరినా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.
ముస్లింలకు కబ్రస్థాన్ కోసం స్థలాన్ని కేటాయించక పోవడంతో ఆయా గ్రామాల ముస్లింలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం లక్ష్మాపూర్‌కు చెందిన అబ్బాస్బీ గుండెపోటుతో మృతిచెందింది. ఆర్అండ్ఆర్ కాలనీలో ఎక్కడా కబ్రస్థాన్ లేకపోవడంతో గజ్వేల్ పట్టణంలోని కబ్రస్థాన్‌లో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మృతిచెందిన ముస్లింల చివరి మజిలీ కార్యక్రమాలను చాలా వరకు వారి బంధువుల గ్రామాల్లో నిర్వహించిన సంఘటనలు ఉన్నాయి. శుక్రవారం ఎర్రవల్లికి చెందిన నజియా మృతిచెందడంతో దహన సంస్కారాలు చేసేందుకు స్థలం లేకపోవడంతో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆమె మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలోనే శ్మశాన వాటికలు, కబ్రస్థాన్‌కు స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు.