తొగుట, నవంబర్ 15: గులాబీ జెండా నీడలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమారుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మితే గోసపడతామన్నారు. బుధవారం తొగుట మండలంలోని వర్ధరాజుపల్లి, గోవర్ధనగిరి, గుడికందుల, ఘనపూర్, మోట్టు, బండారుపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం, రోడు షోలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులు డప్పుచప్పులతో దారి పొడవునా ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో అన్నివర్గాలు అనేక ఇబ్బందులు పడ్డారని, 2014 తర్వాత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో విపక్షాలకు స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ సీఎం కేసీఆర్ వెంటే నడుస్తుందని, ఆయన మీద ప్రజలు పెంచుకున్న విశ్వసనీయత అటువంటిదని పేర్కొన్నారు. అధికారం కోసం ఎన్నో హామీలిస్తున్నా ప్రతిపక్షాలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు సరఫరా కావడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుందని ఆరోపించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు, రైతులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గత ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన ఎమ్మెల్యే రఘునందర్‌రావును గ్రామాల్లోకి వస్తే నిలదీయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారని, ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీలను భూస్థాపితం చేయాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పని చేస్తున్న కారు గుర్తుకు ఓటు వేసి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జడీపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు కలీమొద్దీన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బో ధన కనుకయ్య, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, కుంబాల శ్రీనివాస్, ఎంపీటీసీ కొమ్ము శరత్, స్వామి, సర్పంచ్‌లు మల్లయ్య, ఎల్లం, కుంభ శారధ, రఘోత్తంరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.