పటాన్చెరు, సెప్టెంబర్ 10: సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలో పదిహేను రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. పటాన్చెరు మండలం ముత్తంగితో పాటు మరో నాలుగు గ్రామాలను ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయని, ఈ నెల 3న సమీప తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పంచాయతీల్లో సేవలు నిలిచిపోయాయి. అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ముత్తంగి గ్రామంలోని పలు కాలనీలకు గత నెల చివరి వారంలో తాగునీటిని వదిలారు.
ఆ తర్వాత తాగునీరు సరఫరా నిలిచిపోయింది. సెప్టెంబర్లో ఒక్క రోజు కూడా మిషన్ భగీరథ నీరు సరఫరా కాలేదు. దాదాపు 25వేల జనాభా ఈ గ్రామ పరిధిలో నివసిస్తున్నారు. ముత్తంగి గ్రామానికి, దత్తాత్రేయ కాలనీకి ఒక్కో కనెక్షన్ను మిషన్ భగీరథ గ్రిడ్నుంచి ఇచ్చారు. దత్తాత్రేయనగర్ కాలనీ ద్వారా పలు కాలనీలకు సరఫరా అయ్యే నీరు ఆగిపోయింది. ప్రజలు పంచాయతీ సిబ్బందిని అడిగితే గ్రిడ్ నుంచి నీరు రావడం లేదని చెబుతున్నారు. గ్రిడ్ అధికారులను అడిగితే తాము రెగ్యులర్గా నీటిని సరఫరా చేస్తున్నామని సెలవిస్తున్నారు.
ఈ విషయంపై విచారిస్తే ముత్తంగి గ్రామ పరిధిలోని పలుకాలనీల్లోని పైప్లైన్లలో సమస్యలు ఉన్నట్లు తేలింది. మిషన్ భగీరత ద్వారా కాలనీలకు వేసిన పైప్లైన్లను ప్రైవేట్ వ్యక్తులు, పంచాయతీ సిబ్బంది ఇష్టానుసారంగా తవ్వడంతో అనేక చోట్ల మరమ్మతులు వస్తున్నాయి. ముత్తంగి పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడం ప్రజల పాలిట శాపంగా మారింది.
రెండు రోజుల్లో సరిదిద్దుతా
ముత్తంగిలోని కొన్ని కాలనీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిన విషయం వాస్తవమే. వరద కారణంగా పైప్లైన్లు ధ్వంసమయ్యాయి. రెండు రోజుల్లో వాటికి మరమ్మతు చేసి తాగునీటిని అందజేస్తాం. గ్రిడ్ నుంచి కూడా తాగునీరు సరిపోను రావడం లేదు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తా.
– ముత్తంగి కార్యదర్శి/మున్సిపల్ బిల్ కలెక్టర్ నవోద్రెడ్డి