మెదక్, (నమస్తే తెలంగాణ) డిసెంబర్ 30: ఈ కేవైసీ అప్డేట్ చేయించుకుంటేనే మహాలక్ష్మి పథకం కింద రూ.500 సిలిండర్ అందుతుందని పెద్దఎత్తున ప్రచారం కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. కనెక్షన్ పేపర్లు, ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారు. కనెక్షన్ ఎవరి పేరుమీద ఉంటే వారి వివరాలు నమోదు చేయించుకోవాల్సి ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాలు మాట్లాడుకుని మరీ మండల కేంద్రాలకు వస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో వృద్ధులు, మహిళలు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్యాస్ రాయితీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు, నిర్వాహకులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 17 ఏజెన్సీలుండగా 2,35,412 కనెక్షన్లు, సంగారెడ్డి జిల్లాలో 35 ఏజెన్సీల్లో 5,66,858 కనెక్షన్లు ఉన్నాయి.
మహాలక్ష్మీ పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రూ.500 కే గ్యాస్ సిలిండర్ను పొందేందుకు మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. గ్యాస్ వినియోగదారులు వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలని పుకార్లు రావడంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వివరాలను (కేవైసీ) అప్డేట్ చేయించుకుంటేనే ఈ పథకం వర్తిస్తుందని జరిగిన ప్రచారంతో వారం రోజులుగా ప్రజలు కనెక్షన్ బుక్లు, ఆధార్ కార్డులతో ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో మొత్తం 17 ఏజెన్సీలుండగా 2,35,412 కనెక్షన్లు ఉన్నాయి. ఈ నెల 31లోగా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, లేదంటే రూ.500లకే గ్యాస్ రాదని వదంతులు సృష్టించడంతో ఉదయం 6 గంటల నుంచే తీవ్ర చలిలో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు.
జిల్లాలోని ఆయా మండలాల పరిధి గ్రామాల నుంచి ఈ కేవైసీ కోసం ఏజెన్సీల వద్దకు వందలాదిగా వస్తున్నారు. ఈ కేవైసీ చేసుకునేందుకు వృద్ధ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని కొడుకులు ఏజెన్సీలకు చేరుకుంటున్నారు. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరున ఉంటే వారే కేవైసీ చేసుకోవాల్సి ఉండడంతో డబ్బులు చెల్లించి ప్రేవేటు వాహనాల్లో వృద్ధులు, చంటి పిల్లల తల్లులు అవస్థలు పడుతూ వస్తున్నారు. ఆలస్యమైతే తామెక్కడ అవకాశాన్ని కోల్పోతామోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ కేవైసీపై తమకెలాంటి ఆదేశాలు రాలేదని, వినియోగదారులంతా ఒకేసారి వస్తుండడంతో సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఏజెన్సీల వద్ద బోర్డులు పెట్టినా ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా సర్పంచ్లు, కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు.