గుమ్మడిదల, డిసెంబర్ 30: బల్దియాతో మా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేయవద్దని గుమ్మడిదల మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మెదక్-బాలానగర్ జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల ప్రజలు ధర్నా, రాస్తారోకో చేశా రు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సద్ది విజయాభాస్కర్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామాలకు చెందిన ప్రజలు, పలు పార్టీల నాయకులు మున్సిపాలిటీ ఏర్పాటును వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంట పాటు నిరసన వ్యక్తం చేయడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి.
వీరికి మద్దతు గా గుమ్మడిదల మండల రైతులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, దోమడుగు, వీరన్నగూడెం మాజీ సర్పంచ్‌లు అభిశెట్టి రాజశేఖర్, పొన్నబోయిన మమతావేణు ఆయా గ్రామా ల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పచ్చని పంట పొలాల్లో కాలం వెళ్లదీస్తున్న మా గ్రామాల ప్రజలను పన్నుల రూపంలో అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. సర్కారు తీసుకున్న మున్సిపాలిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ చేయడం వల్ల సామాన్య ప్రజలపై పన్నుల భారం పడుతుందన్నారు.
ఉపాధిహామీ పనులతో మండలంలో 4వేల మంది కూలీలు బతుకుతున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ చేయడం వల్ల పనులు లేక ఉపాధి కోల్పోతారని సర్కారుకు సూచించారు. ఇప్పటికే అన్నారం సమీపంలో ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఉండడం వల్ల బహుళ అంతస్తులకు అనుమతులు లేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. మున్సిపాలిటీ నిర్ణయాన్ని పునరాలోచించి గ్రామ పంచాయతీలుగానే కొనసాగేంచే విధంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ నిర్ణయాన్ని వెన క్కి తీసుకునే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులకు పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేయించారు. కార్యక్రమంలో చక్రపాణి, గటాటి రమేశ్, సుంకరిశంకర్, మురళి, మంగయ్య, ముద్దంగుల గోపాల్, మడపతి గణేశ్, వినోద్‌గౌడ్, యాదగిరి, మహేశ్, జైపాల్‌రెడ్డి, భద్రయ్య, గరీబ్, శ్రీను పాల్గొన్నారు.