మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 16: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం టీ మందాపూర్ గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులు 3 గంటల సరఫరా చాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు 6 గంటల కరెంట్ ఇస్తే పంటలకు సాగు నీరు సరిగా అందక పొలాలు తడులు అందక ఎండిపోయి రైతులు రోడ్డెక్కిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలు పారదోలేందుకు ధరణి చేపడితే అనసవరంగా రద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ చిన్న శంకరంపేట మండల అధ్యక్షుడు పట్లోళ్ల రాజు, నాయకులు నారాయణ, అశోక్, దేవయ్య, శంకరయ్య, దశరథం, మాణిక్యం, మహేందర్, ప్రశాంత్, నర్సింలు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.