సదాశివపేట, జూన్ 30: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ శివారులోని బ్లూక్రాఫ్ట్ ఆగ్రో పరిశ్రమ బహిరంగ ప్రదేశాలకు రసాయన వ్యర్థాలను విడుదల చేస్తున్నది. దీంతో ప్రజలు కాలుష్యం బారినపడుతున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని నందికంది, గొల్లగూడెం, వెల్టూర్ గ్రామాలతో పాటు సదాశివపేట పట్టణానికి కాలుష్య భూతం పట్టిపీడిస్తున్నది. పరిశ్రమ ద్వారా వచ్చే వాసనతో చేలల్లో పనిచేయలేని పరిస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు.
సాయంత్రం పరిశ్రమ నుంచి వెలువడే దుర్వాసనతో ప్రజలు, వాహనదారులు ముక్కు, నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంటున్నాయి. పరిశ్రమ నుంచి వెలువడే దుర్వాసన భరించలేక పోతున్నామని గొల్లగూడెం, నందికంది గ్రామాల ప్రజలు అంటున్నారు. వాహనదారులు సైతం పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగా చర్మవ్యాధులు, ఊపిరితిత్తులు, కిడ్నీ, కంటి చూపు, చిన్నపిల్లల ఎదుగుదల తదితర సమస్యలకు గురవుతున్నామని వాపోతున్నారు. ఇటీవల కలుషితమైన నీటిని తాగి 35కు పైగా గొర్రెలు, 20 వరకు బర్రెలు మృతిచెందినట్లు స్థానికులు వాపోయారు.

చెరువు, వాగులు కలుషితం
బ్లూక్రాఫ్ట్ పరిశ్రమ కాలుష్యంతో సదాశివపేట మండలంలోని నందికంది, గొల్లగూడెం, వెల్టూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో పరిశ్రమ పక్కనే ఉన్న నందికంది చెరువు రసాయన వ్యర్థాలతో కలుషితమవుతున్నది. చెరువులోని నీరు కలుషితం కావడంతో చేపలు మృతి చెందుతున్నాయి. పరిశ్రమ దిగువ భాగంలో కలుషిత జలాలు వదులుతున్నారు. దీంతో నందికంది, వెల్టూర్ శివారులోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
పరిశ్రమ దిగువ భాగం వెల్టూర్ వెళ్లే రోడ్డు నుంచి పైప్లైన్ వేసి రసాయన వ్యర్థాలు తరలిస్తున్నారు. అక్కడక్కడ పైప్లైన్ పగిలిపోవడంతో భూగర్భ జలాలు కలుషితమై పంటలు పడటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలుష్య జలాలు పంట చేనులోకి చేరి పంటలు ఎర్రబారుతున్నాయని రైతులు తెలిపారు. పరిశ్రమ వదులుతున్న రసాయన వ్యర్థ జలాలను కాలుష్య నియంత్రణ మండల (పీసీబీ) అధికారులు శాంపిల్స్ సేకరణతోనే వదిలిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కంపెనీ ఎదుట ధర్నా సైతం చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి
కాలుష్యం వెదజల్లుతున్న బ్లూక్రాఫ్ట్ పరిశ్రమపై అధికారులు చర్యలు తీసుకోవాలి. పరిశ్రమ విడుదల చేసే వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పటికే పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా పరిశ్రమపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా గ్రామాన్ని, మా జీవితాలను ప్రభుత్వం కాపాడాలి.
– రఘువీరారెడ్డి, నందికంది గ్రామస్తుడు (సంగారెడ్డి జిల్లా)
రోగాల బారిన పడుతున్నాం
కంపెనీ విడుదల చేసే కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నాం. ఊరంతా వాకిలి, ఇండ్లపై బూడిద పడుతున్నది. గాలి,నీరు కలుషితవుతున్నది. గాలి పీల్చడంతో ఏదో ఒక రోగం వచ్చి దవాఖానల పాలవుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. – నిర్మల, నందికంది
గ్రామస్తురాలు (సంగారెడ్డి జిల్లా)