Mahshivaratri Jathara | పెద్దశంకరంపేట, పిభ్రవరి18 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయ ఆవరణలో నిర్వహించే జాతర ఏర్పాట్లపై తహసీల్దార్ గ్రేసీబాయి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 25 నుంచి నిర్వహించే కొప్పోల్ జాతర ఉత్సవాలు ఈనెల 28 వరకు నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన ఏర్పాట్లపై పోలీస్, వైద్య, విద్యుత్, శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు.
కొప్పోల్ ఆలయం చుట్టూ పంట పొలాలు ఉన్నందున కొత్తపేట చౌరస్తా వద్ద వాహనాలు నిలిపేవిధంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మార్వో గ్రేసీబాయి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచినీటి సౌకర్యం, అన్నదానం కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలందిస్తూ రాత్రి వేళలో సైతం పోలీసు బందోబస్తు నిర్వహించాలన్నారు. మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆలయ కమిటీతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సహకరించాలని ఎమ్మార్వో కోరారు. బండ్ల ఊరేగింపు సమయంలో ఆయా గ్రామాల గ్రామ పెద్దలు పర్యవేక్షించి ఎడ్ల బండ్లను వరుస క్రమంలో పంపాలని సూచించారు. గుండంలో క్లోరినేషన్‌ను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని, జాతర సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. బండ్లు తిరుగు సమయంలో అందుబాటులో ఉన్న గ్రామ సేవకులు, పంచాయతీ కార్యదర్శులను నియమించి శాంతి భద్రతలు పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది శాంతిభద్రతలు పరిశీలిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, వైద్యాధికారి శరీపొద్దిన్, వికాస్, ఆలయ కమిటీ సభ్యులు పద్మ బాపిరాజు, రాజశేఖర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, సీతారామారావు, కందుకూరి రవీందర్, గాండ్ల సంగమేశ్వర్, సతీశ్ గౌడ్, శంకర్ గౌడ్, ప్రభులు సార్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.