చేర్యాల, నవంబర్14 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ప్రధాన తాగు నీటి వనరుగా ఉన్న పెద్ద చెరువు డంపింగ్ యార్డుగా మారుతున్నది. కొన్ని మాసాలుగా చెరువు కట్ట పై గుట్టలు, గుట్టలుగా చెత్త సంచులు పేరుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.పట్టణంలో ప్రధానంగా పెద్ద చెరువు,కుడి చెరువు నీటి వనరులుగా ఉన్నాయి ఇందులో కుడి చెరువు శిఖంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఆక్రమణకు గురయ్యాయి. కుడి చెరువు నుంచి వచ్చే వరద నాలాలు సైతం ఆక్రమణకు గురికావడంతో అందులోకి నీరు రావడం తక్కువ కావడంతో పాటు చెరువు సైతం ఆక్రమణలో ఉంది.
పెద్ద చెరువు సైతం కొన్ని మాసాలుగా చెత్త, వ్యర్థాలతో నిండిపోతున్నా ఐబీతో పాటు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పెద్ద చెరువులో పలువురు జం తువుల కళేబరాలు పడేస్తుండగా తాజాగా చెత్త సంచులను నిత్యం తీసుకువచ్చి చెరువుకట్ట పై పలువురు పారేస్తున్నారు.చెరువు కట్ట పై చెత్త సంచులు,జంతువుల కళేబరాలు దర్శనం ఇస్తుండడంతో నిత్యం పెద్ద చెరువు పై వాకింగ్ చేసుకునే వారితో పాటు అటువైపు ప్రయాణిస్తున్న ప్రజలు దుర్వాసనతో ముక్కున వేలేసుకుంటున్నారు.
దీంతో పాటు పలువురు వ్యక్తులు తమ వ్యవసాయ పనుల కోసం మొక్కజొన్న, ధాన్యం తదితర వాటిని ఆరబెట్టుకుని పనులు పూర్తైన అనంతరం వాటి నుంచి వచ్చిన చెత్తను అక్కడే గుట్టలు,గుట్టలుగా వదిలివెళ్లిపోతున్నారు. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు చెత్తతో నిండిపోయే ప్రమాదం ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వరదతో నిండుకుండలా ఉన్న పెద్ద చెరువులో గుట్టలు,గుట్టలుగా చెత్తవేస్తే చెరువు కాస్తా కాలుష్యకోరల్లోకి వెళ్లి అందులో ఉన్న చేపలు తదితర జీవరాశులు సైతం చనిపోయే ప్రమాదం ఉంది.సంబంధితశాఖ అధికారులు స్పందించి పెద్ద చెరువు కట్ట పై చెత్తతో పాటు జంతువుల కళేబరాలు వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.