పటాన్చెరు, ఫిబ్రవరి 18: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో భారీగా చెత్తను తగులబెడుతుండడంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పీసీబీ మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం సంగారెడ్డి పీసీబీ ఈఈ గీత తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందజేసిన నోటీసు వివరాలు వెల్లడించారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఐదు నెలల క్రితం విలీనం చేశారు.
గ్రామ పరిధిలో పోగవుతున్న చెత్తను పాశమైలారం, కర్ధనూర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గుంతలో వేసి భారీగా పోగైన తర్వాత మంట పెట్టి తగులపెడుతున్నారు. చెత్త కాల్చడంపై పీసీబీ జనవాని – కాలుష్య నివారిణి పోర్టల్‌కు పలువురు ఫిర్యాదులు చేశారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలోనూ ప్రచురితమైన కథనాలపై స్పందించిన పీసీబీ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ తెల్లాపూర్ మున్సిపాలిటీకి నోటీసులు జారీ చేశారు. తడి, పొడి చెత్తను విడదీయకుండా తగులబెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చెత్తను తగలబెట్టవద్దని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమెట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఘన వ్యర్థాల నిర్వహణ రూల్స్ 2016 ప్రకారం, ఆర్డర్ 1357(ఈ), 08-04-2016 రూల్స్‌ను పాటించనందుకు, తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 27, 2017ను అతిక్రమించినట్టుగా పేర్కొంటూ నోటీసు జారీ చేశారు.
చెత్తను, ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగులబెట్టడంపై నోటీసులో ప్రశ్నించారు. ‘మీ మున్సిపాలిటీపై జరిమానా ఎందుకు విధించరాదు’ అని నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 1 నుంచి 13వ వరకు ముత్తంగి చెత్త డంపింగ్ చేస్తున్న బహిరంగ స్థలాన్ని తనిఖీ చేశామని, అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా నిత్యం చెత్తను తగలబెట్టడం కనిపించిందని నోటీసులో పీసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం మున్సిపాలిటీ నిబంధనలను పాటించడం లేదని గ్రహించామని, నోటీసు అందిన ఏడు రోజుల్లో జవాబు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.