పటాన్చెరు, డిసెంబర్ 6 : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి తన అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా మైనింగ్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అనుమతులు తీసుకున్న దానికంటే ఎక్కువగా మైనింగ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేసి, అక్రమ ఆస్తులు సంపాదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి యజమానిగా ఉన్న ఆస్తులను ఇటీవల జప్తు చేయడం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంత ఆ పార్టీలో చేరారు. మైనింగ్ అధికారుల తనిఖీలు, ఈడీ అధికారులు దాడులకు బయపడి ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు విమర్శలు ఉన్నాయి. అక్రమంగా మైనింగ్ చేసి, ప్రభుత్వానికి రూ. 300 కోట్ల మేరకు నష్టం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులు తాత్కాలికంగా ఆస్తులు జప్తు చేసి, పోలీసు కేసు నమోదు చేశారు. అధికారంలో ఉండి తన తమ్ముడి పేరుతో సంతోష్ శాండి అండ్ గ్రానైట్ సైైప్లె సంస్థను ఏర్పాటు చేసి, ప్రభుత్వ అనుమతుల కంటే అధికంగా తవ్వకాలు చేశారని ఫిర్యాదులు ఈడీకి అందాయి. దీంతో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సైైప్లె సంస్థకు చెందిన రూ. 80.05 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వం కేటాయించిన క్వారీ కంటే ఎక్కువగా తవ్వకాలు చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ఈడీ అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసినట్లు గుర్తించి, ఈడీ అధికారులు పటాన్చెరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్‌రెడ్డి పై కేసు నమోదు చేసి విచారణ చేసి, అక్రమాలకు పాల్పడ్డాడని కోర్టుకు పంపించారు.అక్రమంగా తవ్వకాలు చేసి ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించలేదని గుర్తించారు.
ప్రభుత్వానికి రాయల్టీ రూ. 39.08 కోట్లు ఎగ్గొట్టారని ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమ మైనింగ్ ద్వారా రూ. 300 కోట్లు లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించి కేసు నమోదు చేసింది. ప్రభుత్వం ద్వారా సంతోష్ శాండి అండ్ గ్రానైట్ సైైప్లె పేరుతో మైనింగ్ అనుమతులు తీసుకుని తవ్వకాలు చేశారు. మధుసూదన్‌రెడ్డితో పాటు ఇతరులు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో మైనింగ్ తవ్వకాలు చేసి సబ్ కాంట్రాక్టర్‌ను ఇతరులకు ఇచ్చినట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయకుండా అక్రమంగా తవ్వకాలు చేసి, మైనింగ్ ఉత్పత్తులను అమ్మకాలు ఎక్కువగా నగదు రూపంలో చేసినట్లు గుర్తించారు. అక్రమ మైనింగ్ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులను బినామీల పేరుతో మధుసూదన్‌రెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులు రూ. 78.93 కోట్ల విలువైన 81 ఆస్తులతో పాటు రూ. 1.12 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తు చేశారు.
ప్రభుత్వం మారడంతో…
పటాన్చెరు మండలంలోని ప్రభుత్వ భూముల్లో మైనింగ్ తవ్వకాలు చేసేందుకు అనుమతులు తీసుకుని, అనుమతుల కంటే అధికంగా తవ్వకాలు చేసినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తమ్ముడికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సైైప్లె సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది, మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినా పటాన్చెరు నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతో కలువడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కానీ, బీఆర్ఎస్ క్యాడర్, నేతలు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌లో చేరలేదు.
పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే గూడెం మహిపాల్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. స్పీకర్‌తో పాటు కోర్టులో ఫిర్యాదు చేసింది. గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు, క్యాడర్‌ను కలుపుకొని పోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నేతలు ఎవరూ ఎమ్మెల్యే వద్దకు పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అక్రమంగా మైనింగ్‌కు పాల్పడి రూ.కోట్లు సంపాదించారని ఆరోపణలు ఉన్న గూడెం మహిపాల్‌రెడ్డి అధికార పార్టీలో చేరడంతో, ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.