సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 7: కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ కింద సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ శరత్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు, కంపెనీ యాక్ట్ మేరకు సామాజిక బాధ్యతగా సీఎస్ఆర్ నిధులు అందించాలన్నారు.
సీఎస్ఆర్ నిధుల వినియోగంలో స్థానిక కంపెనీ ఉన్న ప్రాంతానికి, జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయా కంపెనీలకు ఐదేండ్లలో వచ్చిన లాభాలు సీఎస్ఆర్ కింద జిల్లాలో, జిల్లా బయట, రాష్ట్రంలో, రాష్ట్రం బయట వెచ్చించిన నిధులకు సంబంధించి సరైన సమాచారం, సంతకంతో కూడిన కాపీలు అందించాలని సూచించారు. సీఎస్ఆర్లో ఏ పనులు చేపట్టినా సమాచారాన్ని జిల్లా అడ్మినిస్ర్టేషన్‌కు తెలిపి, కలెక్టర్ అప్రువల్ తీసుకోవాలన్నారు. సీఎస్ఆర్ నిధులు సముచిత మార్గంలో వెళ్లాలన్నారు. ఆయా పరిశ్రమల ఆధ్వర్యంలో జరిగిన పనుల వద్ద కంపెనీ పేరుతో సహా బోర్డు పెడతామన్నారు.
ప్రభుత్వం కంపెనీలను ప్రోత్సహిస్తున్నదని, సింగిల్ విండో సిస్టమ్ అమలుతో అనుమతులు సునాయాసంగా లభిస్తాయని అన్నారు. అందరూ సహకరించినప్పుడే జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. క్లస్టర్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు స్నేహపూరిత వాతావరణంలో ముందుకెళ్లాలని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ప్రశాంత్‌కుమార్, సీపీవో మనోహర, జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.