రైతు బిడ్డకే బిగ్‌బాస్-7 కిరీటం దక్కింది. రియాల్టీ షో విజేతగా గజ్వేల్ మండలం కొల్గూరుకు చెందిన పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఆదివారం సినీనటుడు, బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున విజేతను ప్రకటించారు. ఫైనల్ టైటిల్ కోసం ప్రశాంత్‌తోపాటు అర్జున్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్, ప్రియాంక పోటీలో నిలిచారు. నలుగురు ఎలిమినేట్ కాగా అమర్దీప్, ప్రశాంత్ మధ్య పోటీ ఏర్పడింది. ప్రేక్షకుల ఓట్లు, షోలో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రశాంత్ అంతిమ విజేతగా నిలిచాడు. సోమవారం ప్రశాంత్‌కు స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. రైతుబిడ్డ పేరుతో ప్రశాంత్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేస్తూ ప్రజాదరణ పొందారు. ఈక్రమంలోనే బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది.
Bigg Boss 7 Winner
గజ్వేల్, డిసెంబర్ 18: మూడేండ్లుగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాలనే లక్ష్యం పెట్టుకొని అతడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఏడో సీజన్లో రైతుబిడ్డగా అడుగుపెట్టి మల్లా వచ్చినా..మళ్లొచ్చినా.. తగ్గేదేలే… జై జవాన్ జైకిసాన్ అంటూ డైలాగ్‌లు చెప్పుతూ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. మూడేండ్లుగా చేసిన ప్రయత్నం ఫలించడంతో ఏడో సీజన్లో విజేతగా నిలిచిన రైతుబిడ్డకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితుల మధ్య ఘనం స్వాగతం లభించింది. గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామానికి చెందిన పల్లవి సత్యనారాయణ, విజయ దంపతులకు నలుగురు సంతానం, కూతురు గౌతమి, కుమారులు ప్రశాంత్, మహావీర్, వినయ్ ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ నలుగురు పిల్లలను చదివించారు. పెద్ద కుమారుడు ప్రశాంత్ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేసి తండ్రి సత్యనారాయణకు వ్యవసాయంలో సాయం చేస్తూ అందులోనే నిమగ్నమయ్యాడు. వ్యవసాయం చేస్తూనే రైతులుపడే బాధలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియోలు చేసి వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ షోలో భుజన బియ్యం బస్తాతో అడుగుపెట్టి అందరి మనస్సును గెలుచుకున్నాడు. బిగ్‌బాస్‌లో ప్రతి సందర్భంలో తాను విజేతగా నిలిస్తే తనకు వచ్చే నగదు బహుమతిని రైతులకు అందజేసి వారి కష్టాల్లో పాలుపంచుకుంటానన్నాడు. ప్రతి షోలో రైతుల కష్టాలను తెలియజేస్తూ ప్రేక్షకులతో పాటు షోలో ఉన్న వారి మనస్సును గెలుచుకున్నాడు. ఎప్పుడు సెలబ్రిటీలకే అవకాశం దక్కే బిగ్‌బాస్‌లోకి రైతుబిడ్డ అడుగుపెట్టాడనే సమాచారంతో ఎక్కువ సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా చూశారు. రైతుబిడ్డగా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాలని చూస్తున్నడనే విమర్శలు వచ్చినా కుంగిపోకుండా ఆత్మ విశ్వాసంతో నిలదొక్కుకున్నాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో సినీ నటుడు, బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున విజేతను ప్రకటించారు. పైనల్ టైటిల్ కోసం ప్రశాంత్‌తోపాటు అర్జున్, శివాజీ ప్రిన్స్ యావర్, అమర్దీప్, ప్రియాంక పోటీలో నిలిచారు. నలుగురు ఎలిమినేట్ కాగా అమర్దీప్, ప్రశాంత్ మధ్య ఆఖరి పోటీ ఏర్పడింది. ప్రేక్షకుల ఓట్లు, షోలో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రశాంత్‌ను హీరో నాగార్జున విజేతగా ప్రకటించారు. అంతిమ విజేతగా నిలవడంతో పాటు రూ.35 లక్షల నగదు, కారు, రూ.15 లక్షల విలువైన బంగారం దక్కించుకున్నారు.
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు సొంత గ్రామం కొల్గూర్లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితుల మధ్య సోమవారం సాయంత్రం ఘనస్వాగతం లభించింది. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు ర్యాలీతో చేరుకున్న ప్రశాంత్‌కు దారిపొడవునా స్వాగతం పలికారు. కొల్గూర్లో బ్యాండ్ మేళ, డీజేల మధ్య డ్యాన్స్‌లు చేసుకుంటూ గ్రామస్తులు స్వాగతం పలికారు.
బిగ్‌బాస్ సీజన్ ఏడులో విజేతగా నిలిచా. నన్ను విజేతగా గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. నగదు బహుమతిని రైతుల కోసమే వినియోగిస్తా. రైతుల మద్దతుతో గెలుపొందడం సంతోషంగా ఉంది. గెలుచుకున్న కారు నాన్నకు, నెక్లెస్‌ను అమ్మకు ఇస్తా.
బిగ్‌బాస్ సీజన్ ఏడులో విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలువడం సంతోషంగా ఉందని, పొలాల నుంచి బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందన్నారు. ఈ సీజన్లో రైతుబిడ్డగా అడుగుపెట్టి సామాన్యుల దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచారని ట్వీట్ చేశారు.