చేర్యాల, మార్చి 24 : చేర్యాల ప్రాంతంలో నెలకొన్న సాగునీటి సమస్య, పెండింగ్ పనుల గురించి సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. తపాస్‌పల్లి, లద్నూ రు రిజర్వాయర్లకు దేవాదుల నుంచి వెంటనే నీటిని పంపింగ్ చేసి పంటలను కాపాడాలని కోరారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని అందించేందుకు రూ. 350 కోట్లతో కాల్వ నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఈ పనులు పూర్తి చేయాలని కోరారు.
మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తపాస్‌పల్లి తరలించవచ్చని, తద్వారా 365 రోజులు రిజర్వాయర్లలో నీళ్లు ఉంటాయని తెలిపారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చేర్యాలలో ప్రభుత్వ దవాఖాన భవనం, సమీకృత ప్ర భుత్వ కార్యాలయాల భవన సముదాయం పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. చేర్యాల, జనగామ దవాఖానలకు కావాల్సిన పరికరాలను సరఫరా చేయాలని సభదృష్టికి తీసుకువచ్చారు.