చేర్యాల, జనవరి 12 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై సమీక్ష సమావేశం జరిగింది. మున్సిపల్ కమిషనర్ నాగేందర్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల ముఖ్య నా యకులు, మున్సిపల్ అధికారులతో ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రూ.18 కోట్లతో చేర్యా ల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సమీక్ష జరిపామన్నారు.
ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలు సమీక్షలో తన దృష్టికి వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. జాతీయ రహదారి పనులపై నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. గాంధీ సెంటర్ వద్ద పనులు సకాలంలో పూర్తి చేయించాలని, వైకుంఠధామం వద్ద పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. చేర్యాల నుంచి ఆకునూరు వెళ్లే రోడ్డు వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, బాలాజీ సీనిమా థియేటర్ నుంచి శ్రీనగర్‌కాలనీ మీదుగా వెళ్లే బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరినట్లు తెలిపారు. అంబేద్కర్ భవన్‌కు కావాల్సిన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద షాపింగ్ కాంప్లెక్స్నిర్మాణంతో పాటు ఆయా వార్డుల్లో డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ పథకం ద్వారా పెద్ద చెరువుకట్ట సుందరీకరణ కోసం రూ.మూడుకోట్ల16లక్షలు మంజూరు చేయించామన్నా రు. చేర్యాల అభివృద్ధికి ఎంపీ అన్ని విధాలుగా సహకరించాలని ఆయన కోరారు.
చేర్యాల, కొమురవెల్లి,మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఉన్న ఆర్ఎంపీలపై వేధింపులు వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.గ్రామాల్లో ప్రజలకు అత్యవసర సేవలందిస్తున్న ఆర్ఎంపీలపై వేధింపులు కొనసాగిస్తున్నారని, అధికార పార్టీ అండగా కొనసాగుతున్న ఈతతంగాన్ని జిల్లా వైదాధికారి వెంటనే ఆపాలని, లేని పక్షంలో ఆర్ఎంపీలతో కలిసి ఉద్యమాలు చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీ య రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీని ఎమ్మెల్యే పల్లా పరిశీలించారు. వెంటనే నీరుపోయే మా ర్గం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.