చేర్యాల, ఫిబ్రవరి 24: ధర్మసాగర్ నుంచి గండిరామారం వరకు ఫేజ్-2లోని రెండు మోటర్లు ఆన్‌చేసి బొమ్మకూరు, వెల్దండ, కన్నెబోయినగూడెం, లద్నూర్ రిజర్వాయర్లను నింపి, తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చేర్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేర్యాల డివిజన్లో తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద ఉన్న చెరువులు, కుంటలు, ఆయకట్టు తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ఫిబ్రవరిలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
బోరుబావులు ఎండిపోతున్నట్లు తెలిపారు. గతంలో 200 నుంచి 300ల ఫీట్ల లోతు బోర్లు వేస్తే సమృద్ధిగా నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం 800 ఫీట్ల లోతులో బోరు వేసినా నీరు రావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పదిహేను రోజుల పాటు దేవాదుల ప్రాజెక్టులోని ఆపరేషన్, మెయింటనెన్స్ సి బ్బంది వేతనాల కోసం సమ్మెకు దిగినట్లు తెలిపారు. దీంతో పదిహేను రోజులు మోటర్లను నిలిపివేశారని గుర్తు చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని పేర్కొన్నారు. దీని పై ఉన్నతాధికారులతో పాటు శాఖ మంత్రితో తాను మాట్లాడినట్లు తెలిపారు. దీనిపై ఏ ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడలేదని విమర్శించారు.
దీనిపై తాను మాట్లాడితే చివరికి ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించినట్లు ఎమ్మెలే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎండకాలంలో కూడా చెరువులు నింపినట్లు తెలిపారు. ఆ సమయం లో 365 రోజులు చెరువులు, కుంటలు జళకళతో నిండుకుండల్లా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యే నీళ్లు తేవడం లేదని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, తానే స్వ యంగా అధికారులు, మంత్రులతో మాట్లాడి మోటర్లు ఆన్ చేయించడంతో ప్రస్తుతం గండిరామారం నుంచి 10 క్యూబిక్ నీళ్లు వస్తున్నట్లు తెలిపారు.
ఆ నీళ్లు సరిపోవని, అదనంగా నీళ్లు వదలాలని అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. తపాస్‌పల్లి నుంచి ఆలేరుకు నీళ్లు వెళ్లుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, తపాస్పల్లిలో నీళ్లు లేనప్పుడు ఆలేరు నీళ్లు ఎట్లా వెళ్తాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.
అమాయక రైతులను మోసం చేసేందుకు కొంతమంది కాంగ్రె స్ నాయకులు ఇలాంటి చిల్లర ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి మాత్రమే ఆలేరుకు నీళ్లు వెళ్తున్నాయని తెలిపారు. అంతకుముందు చేర్యాల పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘సురక్షా లెన్స్ మార్ట్ అండ్ ఆప్టికల్స్’ను ఎమ్మెల్యేముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, జిల్లా నాయకుడడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ చేర్యాల, మద్దూరు మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, మేక సంతోశ్‌కుమార్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, నాయకులు పెడతల ఎల్లారెడ్డి, మంగోలు చంటి, చొప్పరి సాగర్, శివగారి అంజయ్య, బొల్లు చంద్రమౌళి, తాడెం కృష్ణమూర్తి తదితరులు పా ల్గొన్నారు.