Paddy Crop | మిరుదొడ్డి, మార్చి 12 : యాసంగి సీజన్లో అప్పొ… సప్పొ… చేసి వేసిన వరి పంటకు సాగునీరు అందక వేసవిలో మండుతున్న ఎండలకు ఎండు ముఖం పట్టడంతో రైతన్నలు దిగాలు పడిపోతున్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డి టౌన్‌కు చెందిన అయ్యోరి బాలయ్య అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల్లో వ్యవసాయ భూమిలో రూ.60 వేలు వరకు పెట్టుబడి పెట్టి యాసంగిలో వరి పంట వేశాడు. వరి పొట్ట దశకు వచ్చే క్రమంలోనే బోరు బావిలో నీళ్లు అడుగంటి పోవడంతో వరి పంట 2 ఎకరాల వరకు ఎండి పోయింది. వరి పంట ఎండు ముఖం పట్టడంతో చేసేదేమి లేక తన పాడి బర్రెకు ఎండిన వరి పంటను మేపుతున్నాడు. రెండు ఎకరాల వరి పంట ఎండటడంతో రైతుకు సుమారు పెట్టుబడితో పాటు పంటకు వచ్చే రాబడితో కలిపి మొత్తం రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తన బాధను వ్యక్తం చేశాడు.
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మా రైతులకు కష్టాలు లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాత్రి 12 గంటల కరెంట్ ఇయ్యడంతో శాన కష్టం అవుతుంది. రాత్రి 10 గంటల నుంచి కరెంట్ ఇచ్చి పగటి పూట కట్ చేసుకుంటే మంచిగుంటది. కేసీఆర్ సార్ ఉన్నప్నుడైతే పదేండ్లలో కరెంట్, సాగు నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అన్ని కష్టాలే… మా బతుకులు ఎటైతాయో…ఏమే…ఆ దేవుడికే రైతులను రక్షించాలి.
– అయ్యోరి బాలయ్య, మిరుదొడ్డి.