మెదక్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో చిరుజల్లులు తప్ప భారీవర్షాలు కురవడం లేదు. ఎగువన కురిసిన వర్షాలకు జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ పొంగి పొర్లుతున్నది. మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం డ్యామ్ పొంగిపొర్లుతున్నది. జిల్లాలో మూడు రోజులుగా చిరుజల్లులే కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 10 శాతం చెరువులు మాత్రమే పూర్తిగా నీటితో నిండాయి. మెదక్ జిల్లాలో 2632 చెరువులు ఉండ గా, 822 చెరువులు అలుగు పారుతున్నాయి.
0-25 శాతం 661 చెరువులు నిండగా, 25 నుంచి 50 శాతం 556 చెరువులు, 50 నుంచి 75 వరకు 593 చెరువులు, 75 నుంచి 100 శాతం నీటితో 564 చెరువులు నిండాయి. భారీ వర్షాలు కురిస్తే తప్ప చెరువులు నిండే అవకాశం లేదు. ఘనపూర్, హల్దీ, పోచారం ప్రాజెక్టులు నిండాయి. మంజీరా నదిపై కొల్చారంపాపన్నపేట మండలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట పొడవు 2,377 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 0.135 టీఎంసీలు. ఇప్పటికే 0.135 టీఎంసీల నీటిని దాటి 35 వేల క్యూసెకుల నీటితో ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.
ఈ ప్రాజెక్టు కింద 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఘనపూర్ ఆనకట్ట పరిధిలో మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వ ల ద్వారా 21,625 ఆయకట్టుకు నీరందనున్నది. మహబూబ్ నహర్ కెనాల్ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా, ఈ కాలువ ద్వారా కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఫతేనహర్ కెనాల్ పొడవు 12.80 కి.మీ, దీని పరిధిలో పాపన్నపేట మండలంలోని 11గ్రామాల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఘనపూర్ ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు కింద రైతులు వరినాట్లు వేస్తున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా సరైన వానలు లేక మెదక్ జిల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు. మూడు రోజులుగా కురుస్తున్న ముసురుతో కాస్త ఊరట కలిగింది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. భారీ వర్షాలు కురిస్తే చెరువులు పూర్తిగా నిండే అవకాశం ఉంది. జిల్లాలో ఇంకా 50వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
వర్షాలు కురుస్తున్నందున మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది 24/7 అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. రూమ్‌ను శనివారం కలెక్టర్ సందర్శించి రిజిస్టర్‌ను పరిశీలించారు. వరదపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, లోతట్టు ప్రాంతాలు, లో లెవల్ కాజ్‌వేల వద్ద అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పీఆర్, మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూమ్‌లో సేవలందిస్తున్నారని తెలిపారు.
పాపన్నపేట, ఆగస్టు 16: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కురుస్తున్న వర్షాలకు తోడు సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో మంజీరా నదిలో వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు నిండి పొంగిపొర్లుతున్నది. దీంతో ఏడుపాయల దుర్గామాత ఆలయం ముందు నుంచి మంజీరా నదిలో వరద ప్రవహిస్తున్నది. రెండు రోజుల క్రితం దుర్గామాత ఆలయం మూసివేశారు. ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. దుర్గామాత ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఘనపూర్ ఆనకట్ట నీటి ఉధృతిని పరిశీలించారు. ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌కు సూచించారు.
సంగారెడ్డి, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో4.4 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. రెండు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 8 మండలాల్లో అధిక వర్షపాతం, 17 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. చౌటకూరు మండలంలో 9 సెం.మీ.లు, పుల్కల్లో 8.8, గుమ్మడిదలలో 8,ఝరాసంగంలో 7.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నారింజ వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. జాడిమల్కాపూర్ జలపాతం పొంగిపొర్లుతున్నది. రేజింతల్-ఎల్గోయి మధ్యన ఉన్న మామిడివాగు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బూచినెల్లి-ఘనపూర్ మధ్య వాగు పొంగిపొర్లుతున్నది. నారాయణఖేడ్-ఖాంజిపూర్ మధ్య రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పుల్కల్ మండలం ఇసోజిపేట వద్ద సింగూరు ప్రాజెక్టు కెనాల్ గండి పడింది. సంగారెడ్డి జిల్లాలో సుమారు 300 ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి. అధికారుల లెక్కల ప్రచారం జిల్లాలో 33 శాతానికిపై గా 80 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మంజీరా డ్యామ్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.