సంగారెడ్డి, జూన్ 29(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 30న పేలుడు జరిగి 54 మంది కార్మికులు మృతిచెందారు. రోజుల తరబడి కొనసాగిన సహాయక చర్యల్లో కార్మికుల మృత బాగాలు లభ్యమయ్యాయి. ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు కాలి బూడిదయ్యారు. దీంతో వారి పార్థివదేహాలను చూసే అవకాశం కూడా కుటుంబ సభ్యులకు దక్కలేదు. మృతి చెందిన కార్మికుల్లో అత్యధికులు ఉత్తర్ప్రదేశ్, బీహార్, ఒరిస్సా ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. మృతిచెందిన 54 మంది కార్మికుల్లో 25 మంది పర్మినెంట్ కాగా, 18 మంది క్యాజువల్, 11 మంది కాంట్రాక్టు వర్కర్లు ఉండగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పరిశ్రమ యాజమాన్యం నిర్ల క్ష్యం వల్ల తమవారు చనిపోయారని బాధిత కుటుంబాలు అక్రోశం వెల్లగక్కుతున్నాయి. అదే సమయంలో కోటి రూపాయల పరిహారం ఇస్తామని మాట ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి, పారిశ్రామిక యాజమాన్యం మాట తప్పడంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వకపోగా పరిశ్రమ యాజమాన్యం పైన చర్యలు తీసుకోలేదు. పరిశ్రమపై నమోదైన కేసును పూర్తిగా ప్రభుత్వం నీరుగార్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిగాచి పరిశ్రమపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను సైతం ప్రభుత్వం పక్కన పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణలోనే అతిపెద్ద ప్రమాదం సిగాచిలో జరిగింది. ఒకే ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. సిగాచి పరిశ్రమలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. పరిశ్రమలోని స్ప్రేడ్రయ్యర్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, 800 హెచ్పీ మోటార్లకు బదులుగా 1700 హెచ్పీ మోటార్లు వాడటం ప్రమాదానికి దారితీసినట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే 54 మంది కార్మికులు మృతి చెందినట్లు నిపుణుల కమిటీ నివేదికలో తెలిపింది. ఈ మేరకు నిపుణుల కమిటీ 128 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. భవిష్యత్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను నిపుణుల కమిటీ తన నివేదికలో సూచించింది. ప్రభుత్వం ఇప్పటి వరకు నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయడంలేదు.

దీంతో ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన తర్వాత సంగారెడ్డి జిల్లాలోని ఫార్మా ఇతర కంపెనీల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 15కు పైగా ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీల్లో బాయిలర్లు పేలడం, గ్యాస్ లీకేజీలు లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల బొల్లారంలోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. జహీరాబాద్ సమీపంలోని బూచినెల్లి వద్ద ఉన్న పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతిచెందాడు.
ఈ ఏడాది ప్రారంభంలో కాజిపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ కావటంతో ఒక కార్మికుడు మృతి చెందాడు. కాజిపల్లి పారిశ్రామిక వాడలోని రానేడైకాస్ట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. పటాన్చెరులోని పెన్నార్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృత్యువాత పడ్డారు. అధికార యంత్రాంగం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. పరిశ్రమలో ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ పాలసీ(ఈహెచ్ఎస్)ని తప్పకుండా అమలు చేయాలి. అయితే ఏ కంపెనీలో కూడా ఈహెచ్ఎస్లో పేర్కొన భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. పత్రి పరిశ్రమలోని యంత్రాలు, బాయిలర్లు, రియాక్టర్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి.
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను పరిశ్రమల యాజమాన్యాలు తమ వలలో వేసుకుని ఎలాంటి తనిఖీలు లేకుండానే ఎన్వోసీ సర్టిఫికెట్లు పొందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే రియాక్టర్లు, బాయిలర్లు, పైల్లైన్లు, ఇతర యంత్రాలు నిర్ణీత సమయం తర్వాత వాటి వాడకం నిలిపివేసి కొత్త యంత్రాలను బిగించుకోవాల్సి ఉంటుంది. కొత్త రియాక్టర్లు, బాయిలర్లు, యంత్రాలు కొనుగోలు చేస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయన్న కారణంతో కంపెనీలు పాత యంత్రా లు, రియాక్టర్లు, బాయిలర్లను వాడటం కారణంగానే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమలో భద్రతా చర్యలు తప్పకుండా అమలయ్యేలా చూస్తే కార్మికులకు భద్రత ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.