Money looted | నర్సాపూర్, మార్చి20 : కంచే చేనును మేసిన చందంగా తయారైంది నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంకు అధికారుల పనితీరు. ఇంట్లో డబ్బులు ఉంచితే దొంగలు ఎత్తుకెళ్తారని బ్యాంకులో ఉంచితే.. బ్యాంకులో సైతం ఖాతాలోంచి డబ్బులు మాయం చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మృతి చెందిన ఖాతాదారుడి ఖాతా నుండి ఏకంగా రూ.1,02,300లు మాయం చేసి ఇతర ఖాతాలోకి మళ్లించిన సంఘటన నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంకులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితుడి వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన నాగమోళ్ళ ఆగమయ్య నర్సాపూర్లోని ఎస్బీఐ బ్యాంకులో ఖాతా కలిగి యుండగా.. అతడు మూడెండ్ల క్రితం మరణించడం జరిగింది. ఆగమయ్య మరణించే నాటికి అతని ఖాతాలో రూ.1,53,000 ఉన్నాయి. అతని కుమారుడు నాగమోళ్ళ లక్ష్మయ్య ఫిబ్రవరి నెలలో తండ్రి అకౌంట్లో నుండి డబ్బులు ఇవ్వాలని బ్యాంక్ అధికారులను కోరగా డెత్ సర్టిఫికేట్ ఇతర సర్టిఫికేట్లను తీసుకువస్తే నీ పేరుపై ఖాతా తెరిచి అందులో వేస్తామని తెలిపారు.
ఖాతాదారుడి అనుమతి లేకుండానే..
బ్యాంక్ అధికారులు చెప్పిన మాదిరిగానే మృతుడి కుమారుడు లక్ష్మయ్య సర్టిఫికెట్లను తీసుకొని బ్యాంకుకు వెళ్లగా కొత్త ఖాతాను తెరిచి అందులో రూ.50 వేలు మాత్రమే వేయడం జరిగింది. అదే నెల 10వ తేదిన రూ.1,02,300లు ఖాతాదారుడి అనుమతి లేకుండానే బ్యాంక్ సిబ్బంది వేరే వ్యక్తి ఖాతాలోకి బదిలి చేశారు. మిగతా డబ్బుల గురించి బ్యాంక్ అధికారులను నిలదీయగా నీకు అంతే డబ్బులు వస్తాయని తిట్టి పంపించారని బాధితుడు పేర్కొన్నాడు.
మరలా తెలిసినవారిని తీసుకొని వెళ్లగా బ్యాంకు సిబ్బంది తప్పిదం జరిగిందని, బాధితుడి ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరిగింది. చదువు రాని వాళ్లను చూసి బ్యాంక్ అధికారులు ఇలా మోసం చేయడం తగదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఖాతాదారుల అనుమతి లేకుండా ఇతరుల ఖాతాలోకి డబ్బులను బదిలి చేయడంలో మర్మం ఏంటని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం దావాళంగా ప్రచారం జరగడంతో మిగతా ఖాతాదారులు నర్సాపూర్లోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళి వారి ఖాతాలను చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటికైన ఎస్బీఐ బ్యాంకు అధికారులు ఖాతాదారుల విశ్వాసం కోల్పోకుండా జాగ్రత్త వహించాలని పలువురు హెచ్చరించారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు