ములుగు, నవంబర్ 16: రైతులకు నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలను అందించి మంచి దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలని నూనె గింజల విభాగం కేంద్రం సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహూ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఆయిల్‌పామ్ నర్సరీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కలెక్టర్ మనుచౌదరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయిల్‌పామ్ పెంపకం చేసి రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. రాబోయే కాలంలో ఆయిల్‌పామ్ గింజలకు మరింత డిమాండ్ పెరుగుతుందని, సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తాయని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి నికర ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అనంతరం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సందర్శించి, నర్సరీలోని మొక్కల సాగు విధానాన్ని అజిత్ కుమార్ సాహూ పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, రాష్ట్ర ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినిదేవి, ఆయిల్‌ఫెడ్ మేనేజర్ సుధాకర్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారిణి సువర్ణ, ఉద్యానశాఖ అధికారులు, ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిదులు ఉన్నారు.
వర్గల్, నవంబర్ 16: వర్గల్ మండలంలోని శాకారం,గౌరారం గ్రామాల్లో రైతులు వేలూరి కృష్ణారెడ్డి, అభిమన్యూకుమార్రెడ్డి సాగుచేస్తున్న ఆయిల్ తోటలను కేంద్ర నూనెగింజల ఉత్పత్తి విభాగం సంయుక్త కార్యదర్శి అజిత్కుమార్సాహో పరిశీలించారు. డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని పొదుపు చేస్తూ అంతర పంటలు సాగును చేస్తున్న తీరును పరిశీలించి సూచనలు అందజేశారు. మనదేశం 75శాతం నూనెగింజలను దిగుమతి చేసకుంటున్నదని, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడం ద్వారా రాబోయే రోజుల్లో మనమే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుతామని తెలిపారు. అంతర పంటలుగా బొప్పాయి, అరటి, కూరగాయల సాగుచేస్తున్న శాకారం రైతు కిష్టారెడ్డిని అభినందించారు. ఆయన వెంట కలెక్టర్ మనుచౌదరి, రాష్ట్ర ఉద్యానవన శాఖ జేడీ సరోజినిదేవి, ఆయిల్‌ఫెడ్ మేనేజర్ సుధాకర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారిణి సువర్ణ, అధికారులు ఉన్నారు.