సదాశివపేట, మే 1: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. బంగారం ఉన్నందంటూ ఆరేండ్ల బాలికను బలి ఇచ్చే యత్నం చేసిన వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి బస్టాండ్ వెనుకాల గల బీరువా తయారీ ఖార్ఖానాలో బంగారం ఉన్నదని ఓ స్వామిజీని అయోధ్య నుంచి పిలిపించారనే సమాచారం. అయితే పక్కా ప్రణాళికతో బీరువా తయారీ ఖర్ఖానాలో మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో క్షుద్రపూజలు ప్రారంభించారు.
ఇది గమనించిన కొందరు స్థానికులు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షుద్ర పూజలను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా అక్కడ ఉన్న మాంసం మనిషిదా లేక ఏదైనా జంతువుదా అని విచారించాలని స్థానికులు కోరుతున్నారు. బలి ఇచ్చేందుకు పూనుకున్న నిర్వాహకులు ఓ వ్యక్తికి డబ్బు ఆశజూపి ఆరేండ్ల బాలికను అక్కడికి తీసుకొచ్చారని స్థానికులు పేర్కొంటున్నారు. దుప్పటిలో కప్పి ఉంచిన సదరు బాలికను పోలీసులు సమయానికి రాకుంటే బలి ఇచ్చేవారని వారు ఆరోపిస్తున్నారు.