సంగారెడ్డి ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ ఎన్నికల సందడి మొదలైంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. రెండురోజులుగా మున్సిపాలిటీల కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు. పట్టణాల్లోని పార్టీల నేతల దృష్టి కోఆప్షన్ పదవులపై పడిం ది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కోఆప్షన్ సభ్యులను నియమిస్తారు. ఒక్కో మున్సిపాలిటీల్లో నలుగురు కోఆప్షన్ సభ్యులు ఉంటా రు. ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ పాలనలో అనుభవం ఉన్న, ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు.
ఇందులో ఒకరు మహిళా సభ్యురాలు ఉంటారు. అల్ప సంఖ్యాకవర్గం నుంచి ఒక పురుష, ఒక మహిళా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. కోఆప్షన్ పదవి దరఖాస్తు చేసేందుకు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరుతోపాటు 21 ఏండ్ల వయస్సు దాటి ఉండాలి. మాజీ కౌన్సిలర్లు, సామాజిక సేవా కార్యక్రమాల్లో అనుభవం ఉన్న పురుషులు, మహిళలు కోఆప్షన్ పదవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మాజీ కౌన్సిలర్లు, పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గెజిటెడ్ అధికారులు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు కోఆప్షన్ పదవుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
నోటిఫికేషన్లను అనుసరించి కోఆప్షన్ పదవులు ఆశించే అభ్యర్థులు ఈనెల 20 నుంచి 23 తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కోఆప్షన్ పదవులకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన పక్షంలో ఓటింగ్ ద్వారా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన వారికి కౌన్సిలర్లతో సమానంగా హోదా, అధికారాలు ఉంటాయి. మున్సిపల్ పాలకవర్గం ఉన్నంత వరకు కోఆప్షన్ సభ్యులు పదవిలో ఉంటారు.
పదవుల కోసం పోటాపోటీ
మున్సిపాలిటీల్లో కోఆప్షన్ పదవులు దక్కించుకునేందుకు రాజకీయపార్టీల్లో పోటీ నెలకొంది. మున్సిపాలిటీల్లోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు దక్కని నాయకులు కోఆప్షన్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎలాగైనా తమకు కోఆప్షన్ పదవి ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, చైర్మన్ల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, ముత్తంగి, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్మన్లు ఉన్నారు. ఇక్కడ ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు బలం ఉన్న నేపథ్యంలో కోఆప్షన్ పదవులు ఆపార్టీ కైవసం చేసుకోనుంది.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన, పార్టీకి విధేయులైన నాయకులకు కోఆప్షన్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జహీరాబాద్, కోహీర్, సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాలకవర్గాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ కోఆప్షన్ పదవులు ఆపార్టీకి దక్కే అవకాశాలు ఉన్నాయి.జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మూడు మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కీలకంగా మారనున్నారు.