మెదక్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాన్ని సరిగా పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అప్పగించడం, విధివిధానాలను అనుసరించి వ్యవహరించడం, పలు అంశాలను తూ.చా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల అఫిడవిట్లో తమ ఆస్తులు, నేర చరిత్ర, కులం వంటి వివరాలను పకాగా నమోదు చేయాలి. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా వారి నామినేషన్ తిరసరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. అఫిడవిట్లో వివరాలు తప్పుగా నమోదు చేసి ఎన్నికల్లో విజయం సాధించినా ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమకున్న ఆస్తుల వివరాలను విధిగా నమోదు చేయాలి. స్థిర, చర ఆస్తులు, ఆభరణాలు, వాహనాల వివరాలు నిర్థిష్ట ప్రొఫార్మాలో నమోదు చేయాల్సి ఉంటుంది. వారికున్న రుణాలు, అప్పులు, ఐదేళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలు సైతం అందించాలి.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్లో కూడా దాఖలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఆన్లైన్లో దాఖలు చేసిన పత్రాలను తిరిగి ప్రత్యక్షంగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.
శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారుల గదిలో ఉండే గోడ గడియారమే ప్రామాణికంగా తీసుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల స్వీకరణ నిలిపివేస్తారు. ఒకో అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అఫిడవిట్ల విషయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్లలోని అఫిడవిట్లను అదే రోజు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వెబ్ సైట్లలో అప్లోడ్ చేయనున్నారు.
నామినేషన్ వేయడానికి వెళ్లే అభ్యర్థి వెంట నలుగురికి మాత్రమే అవకాశం ఉంది. నామినేషన్‌తోపాటు అభ్యర్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను ఆర్వోకు అందజేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆ ఖాతాను కొనసాగించాలి. అభ్యర్థి నామినేషన్ అఫిడవిట్లో ఫామ్ 26, ఫామ్ ఏబీ నింపాలి. ఒక అభ్యర్థి 4 సెట్ల్ల నామినేషన్లు వేయవచ్చు. అభ్యర్థి డిపాజిట్ ఫీజు జనరల్ అభ్యర్థికి రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థికి రూ.5000లు చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థి సరైన పత్రాలు సమర్పించాలి. నామినేషన్‌కి వచ్చే వాహనాలు ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో నిలపాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వివరాలు కేవైసీ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కేవైసీ డౌన్ లోడ్ చేసుకోవాలి.