వెల్దుర్తి : పంచాయతీలకు పాలక వర్గాలు లేక, ప్రభుత్వ నిధులు రాక గ్రామంలో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. పంచాయతీల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తున్నది. దాంతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పంచాయతీల పాలన పడకేసింది. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు నిధులు లేక, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. పలు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు కూడా లేకపోవడంతో ఇన్చార్జ్ కార్యదర్శులతో నెట్టుకొట్టుస్తున్నారు.
ఉమ్మడి వెల్దుర్తి మండలంలో 30 గ్రామ పంచాయతీలుండగా ఆరెగూడెం, బండపోసాన్పల్లి గ్రామ పంచాయతీలకు కార్యదర్శులు లేక సుమారు ఆరు నెలలు గడుస్తున్నా నూతన కార్యదర్శులు రాలేదు. దీంతో ఆందుగులపల్లి కార్యదర్శి బాలరాజు ఆరెగూడెంకు, రామాయిపల్లి కార్యదర్శి బాలకిషన్ బండపోసాన్పల్లి గ్రామాలకు ఇంచార్జ్ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీల నుంచి కార్మికుల వేతనాల కోసం ఎస్టీవోలకు ప్రతిపాదనలు పంపించినా ఖాతాలోకి డబ్బులు రాకపోవడంతో వేతనాలు రావడం లేదు.
చెత్తలో, మురికిలో పనిచేసే మాకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవా..? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అసలే వేసవి ఎండలు మండిపోతుడడంతో తాగునీటి కష్టాలు ముదురుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, విద్యుత్ కోతలు, మిషన్ భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో పలు గ్రామాల్లో తాగునీటి గోస తప్పడం లేదు. విద్యుత్ కోతలతో పంచాయతీల బోరు మోటర్లు చెడిపోతున్నా, వాటికి మరమ్మత్తులకు సైతం పంచాయతీల్లో పైసలు లేక తాగునీటి ఇబ్బందులు తీర్చలేక పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
వీటికి తోడు పారిశుద్ధ్య నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల నిర్వహణ కూడా పైసలు లేక పంచాయతీలకు భారంగా మారుతుంది. మండలంలోని పలు గ్రామాలలో మురికి కాలువల్లో చెత్త, చెదారం పేరుకుపోవడం, ఇళ్ల మధ్యలో మురికి నీరు పారుతుండడంతో పారిశుద్ధ్యలోపం ఏర్పడుతుంది. నిధులు లేక, జీతాలు చెల్లించలేక, గ్రామాలలలో సమస్యలను తీర్చలేక, ప్రజలు, అధికారుల మధ్యలో కార్యదర్శులు నలిగిపోతున్నారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.