సిద్దిపేట, జూన్ 13: పాఠశాలల్లో బడిపిల్ల లను చేర్పించడానికి ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్య క్రమం నిర్వహిస్తున్నారు. కానీ సిద్దిపేటలోని ఇంద్రానగర్ జడ్పీహెచ్ఎస్ ఇందుకు భిన్నం గా ఉంటుంది. సార్ మీ పాఠశాలలో అడ్మిషన్ కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడుగుతున్న మాట ఇకడ వినబడుతుంది. కార్పొరేట్ సూల్లో అడ్మిషన్ కో సం ఇలాంటి పరిస్థితి ఉంటుంది. మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇంద్రానగర్ జడ్పీహెచ్ఎస్ను దత్తత తీసుకున్న తర్వాత ఈ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.
ఈ విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్లకు డిమాండ్ ఏర్పడింది. 6నుంచి పదోతరగతి వరకు తరగతులు ఉండగా, 7, 8, 9, 10వ తరగతిలో అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. పాఠశాలలో 6 తరగతిలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం 600 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించేందుకు వారికి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పాఠశాలలో 1200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనికితోడు ఇఫ్లు కార్యక్రమంతో విద్యార్థులకు ఇంగ్లిష్తో పాటు ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్పిస్తుండడం ఈ పాఠశాల ప్రత్యేకత. ఇప్పటికే అడ్మిషన్ల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఉపాధ్యాయులు పాఠశాల ఎదుట నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు.