జహీరాబాద్, మే 23 : నిమ్జ్ భూబాధితుల ముందస్తు అరెస్టులతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు, హద్నూర్ ఎస్సై రాజశేఖర్ శుక్రవారం తెల్లవారు జామున మామిడ్గి గ్రామానికి సిబ్బందితో చేరుకున్నారు. నిమ్జ్ భూబాధితులను సీఎంతో కలిసి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తామని పోలీసులు తెలిపారు. నాలుగైదుగురు మాత్రమే రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పగా మేమందరం కూడా వస్తామని మహిళలు అనడంతో సెక్యూరిటీ వల్ల మీరందరూ కలిసేందుకు అవకాశం ఉండదన్నారు.
గ్రామానికి చెందిన నిమ్జ్ భూబాధితులు రాజిరెడ్డి, నాగన్న, సంజీవ్‌రెడ్డి తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిమ్జ్ భూబాధితులకు మధ్య ఉద్రికత పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టు పేరుతో సీఎం తో కలిసి మాట్లాడిస్తామని నమ్మబలికి సభకు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యగా నిమ్జ్ భూబాధితులను అరెస్టు చేసి హద్నూర్ పోలీసు స్టేషన్‌కు తరస్తుండగా మహిళలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నిమ్జ్ బాధితులు మాట్లాడుతూ సారవంతమైన భూములను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని వాపోయారు. పట్టాభూమికి మార్కెట్లో ఎకరానికి రూ. 40 నుంచి 80 లక్షల వరకు ధర పలికితే కేవలం రూ. 15 లక్షలు చెల్లించి తమకు తీరని అన్యాయం చేయడం సరికాదన్నారు. భూములు తీసుకునేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భూమికి బదులు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు, గ్రామస్తుల ఆందోళన మధ్యనే నిమ్జ్ భూబాధితులను అరెస్టు చేసి హద్నూర్ పీఎస్‌కు తరలించారు. నిమ్జ్ భూబాధితులను అరెస్టు చేయడం పట్ల వివిధ పార్టీల నాయకులు ఖండించారు.
నిమ్జ్ ప్రాజెక్టు కోసం బాధిత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, దౌర్జన్య భూసేకరణ, అక్రమ అరెస్టులు ఆపాలని నిమ్జ్ భూబాధితులు శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతి పత్రం అందజేశారు. 2013 భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా భూమి సేకరిస్తున్నారని, పట్టా, ప్రభుత్వ భూములకు ఎకరానికి రూ. 15 లక్షలు చెల్లించడంతో అన్యాయం జరుగుతుందని వాపోయారు.