పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోయి.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది హైదరాబాదులోని నిలోఫర్ దవాఖాన. వివిధ కారణాలతో తక్కువ బరువుతో జన్మించడం, ఇతర అనారోగ్య సమస్యలున్న శిశువుల్లో సాధారణంగా పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. అలాంటి వారికి వైద్యశాలలోని న్యూట్రీషన్ రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా బరువు, ఆరోగ్య స్థితి ఆధారంగా బలవర్ధక ఆహారాన్ని అందిస్తూ.. పిల్లలను ప్రాణగండం నుంచిరక్షిస్తున్నారు.
– సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ)
నిలోఫర్‌లో 20 పడకల సామర్థ్యంతో న్యూట్రీషన్ రీహాబిలిటేషన్(ఎన్ఆర్సీ)ను 2021లో ప్రారంభించారు. ఈ విభాగానికి చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ నిర్మల నోడల్ అధికారిగా వ్యవహరిస్తుండగా, డాక్టర్ దివిజ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ.. చిన్నారుల ఆరోగ్యపరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని సూచించేందుకు ప్రత్యేకంగా న్యూట్రీషియన్ మాధురితో పాటు నలుగురు స్టాఫ్‌నర్సులు, ముగ్గురు ఆయాలు ఈ ఎన్ఆర్సీ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రతి రోజు 30 నుంచి 40 మంది చిన్నారులకు ఓపీ సేవలు అందిస్తున్నామని, అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ నిర్మల తెలిపారు. పిల్లల తల్లులకు కూడా న్యూట్రీషన్తో కూడిన డైట్ ఇస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి వెల్లడించారు.
ఈ పదార్థాలతో ప్రత్యేక డైట్
0-5 ఏండ్ల వయస్సులోపు చిన్నారులకు ఈ సెంటర్లో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. 0-6 నెలల లోపు పిల్లలకు ఫార్ములా ఎఫ్-75, ఫార్ములా ఎఫ్-100డీ, ఎఫ్-100 డైట్ ఇస్తున్నారు. 6 నెలల నుంచి 5 ఏండ్ల వయస్సులోపు వారికి 6 రకాల సాఫ్ట్ డైట్ ఇస్తుండగా, అందులో ఆకుకూరలతో కూడిన చపాతీలు, కిచిడీ, హల్వా వంటివి ఉంటాయి. ఫార్ములా ఎఫ్-75లో పాలు, ఆయిల్, షుగర్, రైట్ పౌడర్ తదితర పదార్థాలను తక్కువ మోతాదులో కలిపి తయారు చేస్తారు. ఈ రకమైన డైట్‌ను శిశువులకు ఎన్ఆర్సీలో చేరిన మొదటి రెండు రోజులు ఇస్తామని న్యూట్రీషియన్ మాధురి వివరించారు. ఆ తరువాత ఫార్ములా ఎఫ్-100డీ, ఎఫ్-100లను దశల వారీగా అందిస్తామని, విటమిన్స్, మినరల్స్ లోపం ఉన్న పిల్లలకు వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ ఇస్తామని పేర్కొన్నారు.
మా బాబును బతికిచ్చిండ్రు
మేము సిద్ధిపేట నుంచి వచ్చినం. బాబు చాలా వీక్ ఉన్నడు. బరువు పెరుగుతలేడు. ఆరోగ్యం బాగుంట లేదు. ప్రైవేట్ల చూపించాలంటే లక్షలు కావాలె. అంత డబ్బు మా దగ్గర లేదు. అందుకే నిలోఫర్‌కు వచ్చినం. బాగా చూసుకుంటుండ్రు. నిలోఫర్ అంటే సర్కార్ దవాఖాన అని మొదట్ల కొంచెం భయపడినం. కానీ ప్రైవేటు దవాఖానలక్కనే ఉంది. మా బాబును బతికించిండ్రు నిలోఫర్ డాక్టర్లు. అందరికీ కృతజ్ఞతలు.
– రఘుమాల, సిద్ధిపేట
60 నుంచి 70 మందికి..
నిలోఫర్ ఎన్ఆర్సీలో ప్రతి నెలా పౌష్టికాహార లోపం ఉన్న 60 నుంచి 70 మంది పిల్లలకు ప్రత్యేక న్యూట్రీషన్తో కూడిన డైట్‌ను అందిస్తున్నాం. 5 ఏండ్లలోపు పిల్లలకు న్యూట్రీషన్తో పాటు అవసరమైన ట్రీట్మెంట్, ప్లే థెరపీ కూడా ఇస్తాం. ఈ థెరపీ వల్ల పిల్లలు త్వరగా కోలుకుంటారు. డిశ్చార్జి తర్వాత కూడా మళ్లీ పౌష్టికాహార లోపంతో బాధపడకుండా మూడు నెలల పాటు పర్యవేక్షిస్తాం. గడిచిన జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల్లో మొత్తం 350 మంది చిన్నారులు చేరగా, అందులో 304 మంది అవసరమైన బరువు పెరిగి పూర్తి ఆరోగ్యవంతులయ్యారు.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ హాస్పిటల్