నారాయణఖేడ్, మే 8: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఏర్పాటులో తీరని ప్రతిష్టంభన కొనసాగుతున్నది. మార్కెట్ కమిటీ పదవులపై ఆశ పెట్టుకున్న ఆశావహులను అప్పుడు ఇప్పుడని ఊరిస్తున్నప్పటికీ నూతన కమిటీ కోసం అడుగులు ముందుకు సాగడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే మార్కెట్ కమిటీ పదవి కాలం ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం మాత్రం ఏర్పాటు కాలేదు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఐదారుగురు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం. ఎవరికి పదవి కట్టబెట్టాలనే విషయంలో ఎంపీ సురేశ్ శెట్కార్, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్రెడ్డిల మధ్య సయోధ్య కుదరని కారణంగానే మరింత ఆలస్యం అవుతున్నదని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది.
రిజర్వేషన్ల ప్రాతిపదికన నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీకి కేటాయించగా, నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మన్సూర్పూర్, నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేట్, కల్హేర్ మండలం కృష్ణాపూర్, నాగల్గిద్ద మండలం శెల్గిర గ్రామాలకు చెందిన నలుగురితో పాటు మరో ఇద్దరు చైర్మన్ పదవిని ఆశించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
వీరిలో ఒకరిని చైర్మన్ పదవికి ఎంపిక చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడంతో మార్కెట్ కమిటీకి పట్టిన గ్రహణం ఇప్పట్లో వీడుతుందా అనే చర్చ సర్వత్రా కొనసాగుతున్నది. మరోవైపు పదవులు ఆశిస్తున్న ఆశావహులు రోజురోజుకు అసంతృప్తికి లోనవుతున్నారు. ఏదిఏమైనా ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఎప్పుడు తెరపడుతుందో వేచిచూడాలి.
రిజర్వేషన్లతో సామాజిక న్యాయం
మార్కెట్ కమిటీల పదవుల కేటాయింపులో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల విధానంతో సామాజిక న్యాయం జరిగిందని చెప్పవచ్చు. తొలిసారి 1998లో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పడగా 2014 వరకు నలుగురు చైర్మన్లుగా కొనసాగారు. ఇందులో ముగ్గురు అగ్రకులాలకు చెందిన వారు కాగా, ఒక్క బీసీ అభ్యర్థికి మాత్రమే అవకాశం దొరిగింది. ఇక 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రిజర్వేషన్ల ఫలితంగా 2016 నుంచి 2023 వరకు చైర్మన్లుగా బీసీలకు అవకాశం దక్కింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎస్సీలకు అవకాశం లభించినప్పటికీ ఇప్పటి వరకు కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే..
నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ కేటగిరీకి కేటాయించడంతో మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కావస్తున్నా మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. నియోజకవర్గంలో కీలకమైన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దళితులకు ఇవ్వడం ఇష్టం లేక జాప్యం చేస్తున్నారనే అనుమానం కలుగుతున్నది. ఈ విషయమై మేము మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిస్తాం. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే చొరవ చూపి మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలి
– విశ్వనాథ్, మాలమహానాడు, ‘ఖేడ్’ నియోజకవర్గ అధ్యక్షుడు
మార్కెట్ కమిటీని త్వరగా నియమించాలి
‘ఖేడ్’ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గాన్ని నియమించాలి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల కారణంగానే మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి ఎస్సీ కేటగిరీకి అవకాశం వచ్చింది. ఏడాదిన్నర కాలంగా జాప్యం చేయడమంటే ఎస్సీలను చిన్నచూపు చూస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవి కాలం ముగిసిన వెంట వెంటనే కొత్త పాలకవర్గాలు ఏర్పాటు చేసింది. చైర్మన్ ఎంపిక విషయంలో ఇంత తాత్సారం చేయడమెందుకో అర్థం కావడం లేదు.
– సాల్మన్, దళిత నాయకుడు, అంత్వార్