సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 10: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 21న నీట్ సజావుగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,924 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
పూర్తిగా సీసీ కెమెరా నిఘాలో నిర్వహించే నీట్‌కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా, అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు.
నిర్ణీత సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్షా కేంద్రంలో అనుమతించరని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందు అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు చేస్తారని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు విధిగా అడ్మిట్ కార్డుతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్ కార్డు సైజు ఫొటో, ఒక ఐడీ ప్రూఫ్ తమ వెంట తెచ్చుకోవాలన్నారు.
దివ్యాంగ అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి పెన్నులు, పెన్సిళ్లు, ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలకు అనుమతి లేదన్నారు. గట్టి పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో (ఎన్టీఏ) జిల్లా నోడల్ అధికారి భారతీదేవి, సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఇంటర్మీడియెట్ అధికారి గోవింద్ రామ్, వైద్యారోగ్య, విద్యుత్, పోస్టల్, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్‌శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల సీఎస్‌లు పాల్గొన్నారు.