పటాన్చెరు రూరల్, మే 26 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణలో 33 బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్ల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది.ఆరువందల మంది క్యాడెట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలిరోజు పేర్లు నమోదు చేసుకుని అవగాహన కల్పించారు. ఈనెల 26నుంచి జూన్ 4 వరకు పదిరోజుల పాటు శిక్షణ శిబిరం కొనసాగుతుందని ఎన్సీసీ అధికారులు తెలిపారు.
ఎన్సీసీ క్యాడెట్లకు నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు సామాజిక సేవ, జాతీయ ఐక్యత స్ఫూర్తి పెంచుతామని తెలిపారు. డ్రిల్, ఆయుధ శిక్షణ, కాల్పుల్లో నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందని వివరించారు. ఎన్సీసీ బీ,సీ సర్టిఫికెట్ పరీక్షలకు క్యాడెట్లను సిద్ధం చేస్తామన్నారు.
థల్ సైనిక్ క్యాంప్ (టీఎస్సీ-2025), గణతంత్ర దినోత్సవ పెరెడ్ (ఆర్డీసీ-2026) వంటి ప్రతిష్టాత్మక శిబిరాలకు అవగాహన కల్పించడం, అగ్నివీర్, ఇతర సైనిక ప్రవేశ పథకాల ద్వారా కెరీర్ను ఎంపిక చేసుకునేలా ప్రేరేపిస్తామని తెలిపారు. 33వ బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్, క్యాంప్ కమాండెంట్ కల్నల్ రమేశ్ సరియాల మే 27న కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని వివరించారు. కల్నల్ రమేశ్ నేతృత్వంలో క్యాంప్ కొనసాగుతుందని తెలిపారు.