జహీరాబాద్, జనవరి 21 : గంజాయి, రేషన్ బియ్యం, మద్యంతో పాటు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. పోలీసు, ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులు మూతపడడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చెరాగ్‌పల్లి శివారులో మాడ్గి చౌరస్తా వద్ద కర్ణాటక సరిహద్దులో 65వ జాతీయ రహదారి, జహీరాబాద్-బీదర్ రోడ్డుపై గణేశ్‌పూర్ శివారు సరిహద్దు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాత్రి, పగలు నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహించేవారు. ప్రస్తు తం చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు గంజాయి, రేషన్ బియ్యం.. గోవా, ముంబయి నుంచి హైదరాబాద్‌కు మద్యం, ఎలక్ట్రానిక్స్, బంగారం, వెండి అక్రమంగా రవాణా జరుగుతున్నదని, ఎక్సైజ్ అధికారులకు సమాచారం తెలిసినా వాహనాల తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పోలీసులు కర్ణాటక సరిహద్దులో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేసేవారు. శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే చెక్‌పోస్టులు మూతపడ్డాయి. దీంతో తెలంగాణ వైపు నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు ప్రతి రోజూ గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నది. కర్ణాటక వైపు నుంచి గోవా మద్యం, నిషేధిత వస్తువులు ముంబయి నుంచి ట్రావెల్స్ బస్సులు, కార్లలో వ్యాపారులు ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, వెండిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణలోని సరిహద్దు మారుమూల పల్లెల మీదుగా నిషేధిత వస్తువులు హైదరాబాద్‌కు తీసుకువస్తున్న సంఘటనలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా పెట్టి పర్యవేక్షించాలని గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా స్థానిక అధికారులు పట్టించుకోలేదు. అధికారులకు ప్రతి నెలా మామూళ్లు ఇస్తుండడంతో అక్రమ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నదని ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు జహీరాబాద్ మండలంలోని చెరాగ్‌పల్లి వద్ద 65వ జాతీయ రహదారిపై ఎక్సైజ్ చెక్‌పోస్టును ఏ ర్పాటు చేసింది. ఇద్దరు సీఐలు, ఎస్ఐలు, సి బ్బంది ఉన్నా చెక్‌పోస్టులో కానిస్టేబుళ్లు మా త్రమే విధులు నిర్వహిస్తారు. సీఐలు వారానికి ఒకసారి వచ్చిపోతారని, దీంతో చెక్‌పోస్టులో పనిచేసే కానిస్టేబుళ్లు వాహనాలు తనిఖీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి మొలాసిస్తో వచ్చే ట్యాంకర్లు తనిఖీ చేసి తెలంగాణలోకి వచ్చేందుకు అనుమతి పత్రాలు ఇవ్వాలి. కానీ ఎక్సై జ్ ఉన్నతాధికారులు విధుల్లో లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ప్రతి ట్యాంకరు యజమానులు, డ్రైవర్ల నుంచి మామూలు తీసుకొని అనుమతులు ఇస్తున్నట్లు తెలుస్తున్నది.