పటాన్చెరు టౌన్, మే 14 : ఎంపిక చేసుకున్న రంగంలో నిపుణులుగా ఎదగడానికి, ఆయా వృత్తుల్లో ఉన్నతంగా రాణించేందుకు ఇష్టంతో ప్రయత్నించాలని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని టెలివిజన్ ప్రసార కోర్సులు, ప్రయోగాత్మక యానిమేషన్, మీడియా నిర్వహణ పద్ధతుల ఇన్చార్జి ప్రొఫెసర్ సంజీవ్‌కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పూణేలోని ఎంఐటీ-డబ్ల్యూపీయూ విశ్వవిద్యాలయ సహకారంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు వారాల జాతీయ విద్యా ఇమ్మర్సన్ కార్యక్రమం గురువారం ముగిసింది.
ఈ సందర్భంగా సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు, అర్థవంతమైన విద్యాపరమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే వేదికను కల్పించినందుకు ఆయన ఎంఐటీ వర్సిటీకి కృతజ్ఞతలు తెలిపారు. మే 1 నుంచి 14 వరకు నిర్వహించిన ఈ ఇమ్మర్సన్ కార్యక్రమం విద్యార్థులకు సమకాలిన మీడియా పద్ధతులు, కమ్యూనికేషన్ వ్యూహాలు డిజిటల్ స్టోరీ టెల్లింగ్పై అవగాహనను అందించింది. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన రెండు లఘు వీడియోలను ప్రదర్శించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.