పటాన్చెరు, జూలై 7 : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కిషన్‌రావుకు ‘పౌర సంస్థ క్యాపిటల్ ఫౌండేషన్, సొసైటీ ఎర్త్కేర్ ఎన్విరాన్మెంట్’ జాతీయ అవార్డును ప్రకటించింది. ఆదివారం రాత్రి శామీర్‌పేట్‌లోని నల్సార్ వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకటరమణి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అవార్డు అందజేశారు. కిషన్‌రావు అనారోగ్యంతో ఉండటంతో ఆయన కుటుంబసభ్యులు అల్లాని రఘునాథరావు, వైష్ణవి అవార్డు, జ్ఞాపికను వేదికపై స్వీకరించారు. ఈ సందర్భంగా వక్తలు కిషన్‌రావు సేవలను కొనియాడారు. ఫార్మా పరిశ్రమల ద్వారా వస్తున్న కాలుష్యంతో ఏర్పడుతున్న సమస్యలపై ఆయన రాజీలేని పోరాటం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు, హరిత ట్రిబ్యునల్‌లో ఆయ న అనేక కేసులు వేసి కాలుష్య సమస్యపై న్యాయం కోరారన్నారు. పటాన్చెరు మండలం నందిగామ లో నివసిస్తున్న డాక్టర్ కిషన్‌రావు కాలుష్య కారక పరిశ్రమలపై సుధీర్ఘకాలం న్యాయ పోరాటం చేశారు. పటాన్చెరు ప్రాంతంలోని 18 గ్రామాల్లో పూర్తిస్థాయిలో జలాలు కలుషితం అయ్యాయని ఆయన వేసిన కేసులో సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ అందరికీ ఉచితంగా తాగునీరు ఇవ్వాలని తీర్పులో ప్రభుత్వాన్ని ఆదేశించాయి.ఆ తీర్పు ప్ర కారమే 18 గ్రామాలకు నేటికి ఉచితంగా తాగునీ రు లభిస్తున్నది. కిషన్‌రావు నందిగామలో గోశాల ఏర్పాటు చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నారు.