నర్సాపూర్,జూలై 27:చాలామంది రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ జరగలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకువచ్చినప్పుడు రైతులందరికీ రుణమాఫీ జరగాలని, అలాంటి పరిస్థితి లేదన్నారు. ఒక సొసైటీ లో రూ.లక్షలోపు రుణం కలిగిన 240 మంది రైతులు ఉంటే, అందులో కేవలం 140 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు.
ఇంకో సొసైటీలో సుమారు 600 మంది రైతులు ఉంటే కేవ లం 400 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. పొలం అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన రైతులకు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని, క్రాప్‌లోన్ ఉన్నందున రిజిస్ట్రేషన్ చేయడం వీలుకాదని అధికారులు రైతులను వెనక్కి పంపుతున్నారని తెలిపారు. ఈ విషయాలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నానని ఆమె అన్నారు. రుణమాఫీ సరిగ్గా జరగకపోవడంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగితే ఎక్కడా రైతులు పాల్గొనలేదన్నారు.